శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌8, ఎస్‌8 ప్లస్‌

0s8-s8-plusశాంసంగ్‌.. ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల దిగ్గజం. దక్షిణ కొరియా కేంద్రంగా ప్రపంచం నలువైపులా విస్తరించింది. స్మార్ట్‌ఫోన్‌కు పర్యాయపదంగా మారింది. నిన్న మొన్నటి వరకు సాఫీగా సాగుతున్న సంస్థ ప్రయాణంలో ఒక్కసారిగా కుదుపు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి ఐఫోన్‌కు ధీటుగా గత ఏడాది తీసుకొచ్చిన గెలాక్సీ నోట్‌ 7 విఫలం అయింది. విక్రయించిన ఫోన్లను మళ్లీ వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. దీంతో సంస్థకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. మరోవైపు సంస్థ సారథులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైస్‌-ఛైర్మన్‌ లీ జే యాంగ్‌తో, కొందరు ఉన్నతాధికారులు జైలుపాలయ్యారు. ఇది సంస్థ విశ్వసనీయతను దెబ్బతీసింది. ఈ పరిణామాలు మొత్తం మీద శాంసంగ్‌ ప్రతిష్ఠనే మసకబారేలా చేశాయి. ఈ నేపథ్యంలో శాంసంగ్‌ మరో అగ్నిపరీక్షకు సిద్ధమైంది. కొత్త గెలాక్సీ ఎస్‌8, ఎస్‌8 ప్లస్‌లను బుధవారం న్యూయార్క్‌లో ఆవిష్కరించింది.

కొత్త శకానికి నాంది.. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్లతో కొత్త శకానికి నాంది పలుకుతున్నట్లు శామ్‌సంగ్‌ అధ్యక్షుడు (మొబైళ్లు) డీజే కోహ్‌ అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆలంబనతో సరికొత్త సదుపాయాలను పొందుపరిచినట్లు తెలిపారు.
* మరింత భద్రత కోసం కంటిపాపను గుర్తించే ఐరిష్‌ సాంకేతికతతోపాటు ముఖాన్ని, వేలు ముద్రలను గుర్తించే పరిజ్ఞానాన్ని తీసుకొచ్చింది. సంప్రదాయంగా వస్తున్న హోంబటన్‌ను తీసివేసింది.
* అవసరమైతే కంప్యూటర్‌గా కూడా మార్చుకోవచ్చు. ఇందుకు ‘డెక్స్‌’ అనే పరికరానికి ఈ ఫోన్లను అనుసంధానం చేయాలి.
* యాపిల్‌ సిరి, గూగుల్‌ అసిస్టెంట్‌, అమెజాన్‌ అలెక్సాలకు పోటీగా వర్చువల్‌ అసిస్టెంట్‌ ‘బిక్స్‌బె’ౖను మరింత మెరుగుపరిచింది. 360 డిగ్రీల్లో వీడియోలు తీసేందుకు గేర్‌ 360, వీఆర్‌ హెడ్‌సెట్‌ను ఆవిష్కరించింది.

ఎస్‌8: తెర 5.8 అంగుళాలు, బ్యాటరీ 3,000 ఎంఏహెచ్‌
ఎస్‌8 ప్లస్‌: 6.2 అంగుళాలు, బ్యాటరీ 3,500 ఎంఏహెచ్‌