8 జీబీ ర్యామ్‌తో రానున్న గెలాక్సీ ఎస్8

0samsung-galaxy-s8గెలాక్సీ నోట్ 7 ఫోన్‌తో శాంసంగ్ సంస్థ ఎలాంటి నష్టాలను మూటగట్టుకుందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌తో మరోసారి యూజర్ల నమ్మకాన్ని చూరగొనాలని శాంసంగ్ భావిస్తోంది. అందుకు అనుగుణంగానే ఆకట్టుకునే ఇన్నోవేటివ్ ఫీచర్లతో తన గెలాక్సీ ఎస్8 ఫోన్‌ను విడుదల చేయాలని ఆ సంస్థ పట్టుదలతో ఉంది. అయితే ఇప్పటి వరకు వచ్చిన అన్ని కంపెనీలకు చెందిన ఫ్లాగ్‌షిప్ ఫోన్ల కన్నా అత్యంత నూతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఫీచర్లను గెలాక్సీ ఎస్8 ఫోన్‌లో ఏర్పాటు చేయాలని శాంసంగ్ అనుకుంటోంది. ఈ క్రమంలోనే దానికి సంబంధించిన పలు వార్తలు కూడా ఇప్పుడు హల్‌చల్ చేస్తున్నాయి.

8 జీబీ ర్యామ్, 6 ఇంచ్ డిస్‌ప్లే, యూఎఫ్‌ఎస్ ఫ్లాష్ స్టోరేజ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వంటి హై ఎండ్ ఫీచర్లను గెలాక్సీ ఎస్8లో శాంసంగ్ అందించనుంది తెలిసింది. అయితే ఇప్పటి వరకు వచ్చిన అత్యంత సన్నవైన ఫోన్ల కన్నా ఇంకా సన్నగా తక్కువ మందంతో కూడిన విధంగా ఈ గెలాక్సీ ఎస్8ను విడుదల చేయనున్నారని కూడా సమాచారం. ఐఫోన్ లాగే ఈ ఫోన్‌ను కూడా రెండు వేరియెంట్లలో… అంటే గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ మోడల్స్‌లో రిలీజ్ చేయనున్నట్టు తెలిసింది. అయితే దీనిపై శాంసంగ్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరి ఈ ఫీచర్లతో ఎస్8ను అందుబాటులోకి తెస్తుందో లేదో వేచి చూడాలి..!