పాక్ క్రికెటర్ పై సానియా ప్రశంసల జల్లు

0Sania-mirzaచాంపియన్స్‌ ట్రోఫీ చివరి సెమీ ఫైనల్‌ బెర్తు కోసం శ్రీలంక-పాకిస్థాన్‌ తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్‌ ద్వారా పాకిస్థాన్‌ తరఫున 250 వన్డేలు ఆడిన క్రికెటర్‌గా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ షోయబ్‌ మాలిక్‌ ఘనత సాధించబోతున్నాడు. ఈ సందర్భంగా షోయబ్‌ సతీమణి, భారత టెన్నిస్‌ తార సానియా మీర్జా అతనిపై ప్రశంసల జల్లు కురిపించింది. ఈ మ్యాచ్‌ తామందరికీ ఎంతో గర్వకారణమని పేర్కొంది.

‘పాకిస్థాన్‌ పట్ల, క్రికెట్‌ పట్ల అతనికి ఉన్న కమిట్‌మెంట్‌ను ఇది చాటుతోంది. క్రికెట్‌ పట్ల ప్రేమతో దేశానికి ప్రాతినిధ్యం వహించాలన్న తపనతో అతను ఎప్పుడూ ఉంటాడు. అతని తల్లికి, సోదరుడికి, నాకు ఇది ఎంతో గర్వకారణమైన సందర్భం. అతను సాధించిన దానిపట్ల మేం చాలా గర్వంగా ఉన్నాం’ అని సానియా పేర్కొంది.

తామిద్దరం క్రీడాకారులు కావడంతో ఒకరితో ఒకరు కలిసి గడిపేందుకు వీలుగా ప్రయాణాలు ప్లాన్‌ చేసుకుంటామని సానియ వివరించింది. ‘క్రీడాకారులం కావడంతో మేం చాలా సమయం వేరుగా గడుపుతాం. కానీ ఫోన్లు చాలా సాయపడతాయి. ఎంతో సమన్వయంతో ప్లాన్‌ చేసుకుంటాం. నేను ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడే పాక్‌ జట్టు ఆస్ట్రేలియాకు వచ్చింది. అలాంటి సమయాల్లో కలుసుకుంటాం. కొన్నిసార్లు మా షెడూళ్లు మ్యాచ్‌ అవుతాయి. నాకు ఈ వారాంతం కలిసి వచ్చింది. అందుకే దుబాయ్‌కో, ఇండియాకో వెళ్లకుండా ఇక్కడికి (లండన్‌) వచ్చాను. దీంతో కొన్ని క్రికెట్‌ మ్యాచులను వీక్షించే అవకాశం దక్కింది’ అని చెప్పింది. ఇన్ని రోజులు ప్యారిస్‌లో ఉండటం వల్ల చాంపియన్స్‌ ట్రోఫీని క్రమంతప్పకుండా చూడలేకపోయానని, పాక్‌-దక్షిణాఫ్రికా మ్యాచ్‌తోపాటు భారత్‌ మ్యాచ్‌లను కొన్నింటిని మాత్రమే చూడగలిగానని ఆమె చెప్పింది.