సానియా మీర్జాకు నోటీసులు

0Sania-Mirzaహైదరాబాదీ స్టార్ టెన్నిస్ ప్లేయర్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జాకు సర్వీస్ టాక్స్ డిపార్ట్‌మెంట్ నోటీసులు జారీ చేసింది. సానియా మీర్జా సర్వీస్ టాక్స్ ఎగ్గొట్టారని ఈ నోటీసుల్లో ఆరోపించిన సర్వీస్ టాక్స్ విభాగం.. పన్ను ఎగవేతకు గల కారణాలపై వివరణ ఇస్తూ సంబంధిత డాక్యుమెంట్లతో ఫిబ్రవరి 16న తమ ముందు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కొంది.

సర్వీస్ టాక్స్ విభాగం ప్రిన్సిపల్ కమిషనర్ నుంచి ఫిబ్రవరి 6వ తేదీనే ఈ నోటీసులు జారీ అవగా.. ” ఫిబ్రవరి 16వ తేదీన సానియా మీర్జా కానీ లేదా ఆమె తరపున ప్రతినిధి ఎవరైనా సంబంధిత డాక్యుమెంట్లతో కమిషన్ ముందు హాజరు కావాల్సిందిగా” ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఫైనాన్స్ యాక్ట్ 1994 ప్రకారం పన్ను ఎగవేతదారులు విచారణార్హులు అయినందున సానియా మీర్జా కమిషన్ ముందు హజరు కావాల్సిందేనని సదరు సమన్లలో సర్వీస్ టాక్స్ విభాగం స్పష్టంచేసింది.

ఒకవేళ ఈ సమన్లకు స్పందించకపోయినా, లేదా ఉద్దేశపూర్వకంగా గైర్హాజరయినా లేదా సంబంధిత దస్త్రాలు సమర్పించడంలో విఫలమైనా.. చట్టం ప్రకారం శిక్షార్హులు అవుతారు అని సర్వీస్ టాక్స్ విభాగం అధికారులు ఈ సమన్లలో పేర్కొన్నారు. అయితే, ఇంతకీ ఏ వ్యవహారంలో సానియా మీర్జా పన్ను ఎగవేశారనే విషయంలో మాత్రం సర్వీస్ టాక్స్ విభాగం ఈ సమన్లలో స్పష్టత ఇవ్వలేదు.