డ్రగ్స్ తో పోరాడుతోన్న హీరో!

0బాలీవుడ్ విలక్షణ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ పై తెరకెక్కిన `సంజు` పై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు పరాజయం ఎరుగని దర్శకుడిగా పేరున్న హిరాణీ తొలిసారి ఓ బయోపిక్ కు దర్శకత్వం వహించారు. సంజయ్ దత్ జీవితంలోని ప్రతి కోణాన్ని తన చిత్రంలో ఆవిష్కరిస్తానని హిరాణీ చెప్పారు. అందుకు తగ్గట్లుగానే ఇప్పటికే విడుదలైన టీజర్ – ట్రైలర్ లలో రణ్ బీర్ కపూర్ కు బదులు సంజయ్ దత్ కనిపించారు. సంజు పాత్రలో రణ్ బీర్ ఒదిగిపోయిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. టీజర్ – ట్రైలర్ లకు విపరీతమైన స్పందన రావడంతో `సంజు`పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ నెల 29న `సంజు`విడుదల కాబోతోన్న నేపథ్యంలో తాజాగా ఓ సాంగ్ ప్రమోషన్ బిట్ ను విడుదల చేశారు. ‘కర్ హర్ మైదాన్ ఫతే…’ అంటూ సాగే ఈ సాంగ్ బిట్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది.

`సంజు`చిత్రంలోని ‘కర్ హర్ మైదాన్ ఫతే…` అంటూ సాగే పాట ఇపుడు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. శేఖర్ అస్థిత్వ రచించిన ఈ పాటకు విక్రమ్ మాంట్రోస్ సంగీతాన్ని అందించారు. సుఖ్విందర్ సింగ్-శ్రేయా ఘోషల్ లు అద్భుతంగా పాడారు. డ్రగ్స్ బానిసైన సంజును రీహాబిలిటేషన్ సెంటర్ కు తరలించే నేపథ్యంలో ఈ పాట సాగుతుంది. పునరావాస కేంద్రానికి సంజు వెళ్లడం….అక్కడ చికిత్స సమయంలో తీవ్రంగా ఇబ్బందిపడడం….అక్కడ ఉండలేక తప్పించుకుని పారిపోవడం నేపథ్యంలో ఈ పాటనె తెరకెక్కించారు. ఇంటికి చేరే క్రమంలో డబ్బుల్లేని పరిస్థితుల్లో సంజు భిక్షాటన చేయడం….నిరాశ ఆవహించిన సమయంలో అతడి తల్లి అతడిని ఓదారుస్తున్నట్లుగా అనుభూతి చెందడం వంటివి ఈ పాటలో చిత్రీకరించారు. తాను డ్రగ్స్ నుంచి బయటపడాలనుకుంటున్నానని తండ్రిని హత్తుకోవడం డ్రగ్స్ కోరల్లో చిక్కి బయటపడాలని తాపత్రేయపడుతున్న కొడుకుపై తల్లిదండ్రుల ఆప్యాయత నేపథ్యంలో ఈ పాట సాగుతుంది. ఎట్టకేలకు సంజు డ్రగ్స్ మహమ్మారి నుంచి బయటపడి….మళ్లీ తెరపైన కనిపించడం…వంటి వాటిని ఈ పాటలో చిత్రీకరించారు. సంజయ్ దత్ తండ్రి పాత్రలో పరేష్ రావెల్ – తల్లి నర్గీస్ దత్ పాత్రలో మనీషా కోయిరాల నటించారు. సోనమ్ కపూర్ – దియా మీర్జాలతో పాటు అనుష్క శర్మ ఓ కీలకమైన పాత్రలో నటించింది.