టీజర్ టాక్: సంజయ్ ని దింపేసాడుగా

0అక్రమాయుధాల కేసులో సుదీర్ఘ కాలం తన జీవితాన్ని జైలుకు ఇచ్చేసి ఇప్పుడు ప్రశాంత జీవితం గడుపుతున్న సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న బాలీవుడ్ మోస్ట్ క్రేజీ మూవీ సంజు టీజర్ విడుదలైంది. ఒక్క మాటలో చెప్పాలంటే రన్బీర్ కపూర్ మాయ చేసేసాడు. బాడీ లాంగ్వేజ్ మొదలుకుని గొంతు దాకా ప్రతి ఒక్క విషయంలో సంజయ్ దత్ ను అనుకరిస్తూ అద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్ తో కట్టి పడేసాడు. చిన్న టీజర్ అయినప్పటికీ మొత్తం సంజయ్ పాత్ర ఎన్ని షేడ్స్ లో ఉంటుందో రకరకాల గెటప్స్ లో చూపించిన రాజ్ కుమార్ హిరాని మరోసారి వెండితెరపై సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టబోతున్నట్టు కనిపిస్తోంది. తన కథ తనే చెప్పుకున్నట్టు ఈ టీజర్ లో యవ్వనం మొదలుకుని వయసు మళ్లే దాకా మొత్తం కవర్ చేసినట్టు కనిపిస్తోంది. రన్బీర్ కపూర్ మాత్రం ఇంతకంటే గొప్పగా ఎవరు చేయలేరు అన్నంతగా పరకాయ ప్రవేశం చేసాడు.

సంజు సినిమా విషయంలో మరో గొప్ప ఆకర్షణ దర్శకుడు రాజు హిరాని. అమీర్ ఖాన్ పీకే తో సంచలనం రేపిన హిరాని గతంలో త్రీ ఇడియట్స్ తో ఏకంగా చరిత్రే సృష్టించాడు. ఆయనకు సంజయ్ దత్ తో ప్రత్యేక అనుబంధం ఉంది. బాలీవుడ్ సినిమా చరిత్రలో ప్రత్యేకంగా చెప్పుకునే మున్నాభాయ్ సిరీస్ లోని రెండు సినిమాలకు సంజయ్ దత్తే హీరో. మున్నాభాయ్ చలో అమెరికా తీయాలనుకుని విశ్వప్రయత్నం చేసారు కాని కుదరలేదు. ఆ రెండు భాగాలు చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేసుకున్నారు. అందుకే సంజు మీద అంచనాలు చాలా భారీగా ఉన్నాయి. పరేష్ రావల్-మనిషా కోయిరాలా రన్బీర్ తల్లితండ్రులుగా నటిస్తుండగా అతని జీవితంలో అమ్మాయిలుగా అనుష్క శర్మ సోనం కపూర్ దియా మిర్జా నటిస్తున్నారు. జూన్ 29న విడుదల కానున్న ఈ మూవీ కోసం సంజయ్ దత్ ఫాన్స్ మాత్రమే కాదు యావత్ సినిమా ప్రేమికులు ఎదురు చూస్తున్నారు.