అన్నం పెట్టిన ఆడ గెట‌ప్‌

0shanthi-swaroopసినిమాలపై మ‌క్కువ‌తో ఆ యువకుడు ఇంట్లో నుంచి పారిపోయాడు. హైద‌రాబాద్‌కు వ‌చ్చి అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు. కృష్ణానగర్‌లో ఓ సినిమా కార్యాలయంలో ఆఫీస్‌ బాయ్‌గా చేరి సినీ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టాడు. ద‌శాబ్దానికి పైగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. కానీ ఎలాంటి అవ‌కాశాలూ త‌లుపుత‌ట్ట‌లేదు. అయినా నిరాశ చెంద‌లేదు. చివ‌రికి లేడి గెట‌ప్ వేసి బుల్లితెర‌పై ఓ వెలుగు వెలుగుతున్నాడు. అతడే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన శాంతికుమార్‌.

నిజానికి శాంతికుమార్‌ అంటే ఎవరికీ పెద్ద‌గా తెలియదు. తనకు అచ్చొచ్చిన ఆడపాత్రలో ‘జబర్దస్త్‌.. శాంతి’గా అంద‌రికీ సుపరిచితుడు. అవ‌కాశాల వేట‌లో అన్నపూర్ణ స్టూడియో చుట్టూ తిరుగుతున్న అత‌డికి ఒక రోజు.. రాకెట్‌ రాఘవ, రచ్చ రవి క‌నిపించార‌ట‌. నటనపై త‌న‌కున్న మోజును వాళ్ల‌కు వివ‌రిస్తే.. వారి బృందంలో స‌భ్యుడిగా ఒక‌ అవకాశం ఇచ్చారట‌. ఇక అక్క‌డి నుంచి వెనుదిరిగి చూడ‌లేదు. లేడీ గెట‌ప్‌తో చ‌క్క‌ని హావ‌భావాలు, కామెడీ టైమింగ్‌తో బుల్లితెరపై నవ్వులు పూయిస్తున్నాడు.

అన్నీ లేడీ గెట‌ప్‌లే ఇస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ నిరుత్సాహం చెంద‌కుండా వాటినే త‌న బ‌లంగా మార్చుకున్నాడు. అన్ని ఛానళ్లలోనూ ఆడ‌ గెటప్‌తోనే ఆక‌ట్టుకుంటున్నాడు. మ‌హిళా యాంక‌ర్ల‌ను అనుక‌రిస్తూ స్కిట్లు చేస్తున్నాడు. మొహానికి రంగు వేసుకోవ‌డానికి సిద్ధ‌మైన త‌ర్వాత‌ ఏ పాత్ర అయితేనేంటి.. ప్రేక్ష‌కుల‌ను క‌వ్వించ‌డానికి అంటాడ‌త‌డు న‌వ్వుతూ.. ఒక‌ప్పుడు అర్ధాకలితో అలమటించిన అత‌డు ఇంత‌మందికి ఆనందం పంచుతూ ఎద‌గ‌డం గొప్ప విష‌య‌మే క‌దా! క‌డుపునిండా తిండికి క‌రువై, అద్దె కూడా చెల్లించే స్తోమత లేకుండా నానా కష్టాలు ప‌డుతున్న శాంతికుమార్ లాంటి అనేక న‌టుల‌కు వేదిక క‌ల్పిస్తున్న‌ జ‌బర్దస్త్‌కు హ్యాట్సాప్ చెప్పాల్సిందేగా మ‌రి!