సర్దార్ నరేంద్ర సింగ్ మోడీగా

0అప్పుడెప్పుడో జరిగిపోయిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరుగుతున్న ప్రధాని మోడీ వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 1975లో ఇందిరాగాంధీ ప్రకటించిన అత్యవసర పరిస్థితిపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్ లో పడేస్తున్న నరేంద్ర మోడీకి సంబంధించిన పాత విషయం ఒకటి సరికొత్తగా బయటకు వచ్చింది.

ఏ అత్యవసర పరిస్థితిపైన ప్రధాని మోడీ నిప్పులు చెరుగుతున్నారో.. అదే ఎమర్జెన్సీ కారణంగా ఆయన పేరు మొదటిసారి ప్రముఖంగా మారటమే కాదు.. ఆయన భవిష్యత్ జీవితానికి బాటలు వేసినట్లుగా చెప్పక తప్పదు. ఎమర్జెన్సీ సమయంలో పేరున్న నాయకులు మొదలు.. ఎమర్జెన్సీని వ్యతిరేకించే వారు ఎవరు కనిపించినా వారిని నిర్దాక్షిణ్యంగా జైల్లో వేసే వారు. తనకు వ్యతిరేకంగా ఉంటారన్న అనుమానం ఉన్న ప్రతి నాయకుడ్ని జైల్లోకి పంపిన ఇందిరమ్మ తీరుపై ఇప్పటికీ ఆగ్రహం వ్యక్తమవుతూనే ఉంటుంది.

ఇదిలా ఉంటే.. ఇందిరమ్మ అత్యవసర పరిస్థితిని విధించిన వేళ.. పాతికేళ్ల కుర్రాడు ఒకరు చూపించిన చురుకుదనం ఆయన్ను సంఘ్ పరివార్లో అందరి దృష్టి పడేలా చేసింది.ఇంతకీ ఆ కుర్రాడు ఎవరో కాదు.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీనే.
అత్యవసర వేళలో ప్రతిపక్ష నేతల్ని జైల్లో వేయటం మొదలుకొని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంస్థను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పలువురు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. ఇలాంటివేళ.. అరెస్ట్ ప్రమాదాన్ని తప్పించుకునేందుకు మోడీ సిక్కులా వేషం మార్చి.. సర్దార్ నరేంద్ర సింగ్ మోడీగా మారిపోయారట. అంతేకాదు.. సన్యాసిలా వేషం మార్చేసి జార్జ్ ఫెర్నాండెజ్ లాంటి ఎంతోమంది నేతల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించటంలో కీలకభూమిక పోషించిన వైనం తాజాగా బయటకు వచ్చింది.

తాజాగా బయటకు వచ్చిన ఒక నివేదిక ప్రకారం అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు నిషేధిత సాహిత్య గ్రంథాన్ని తీసుకొని ఢిల్లీకి వెళ్లిన మోడీ.. సంఘ్ పరివార్ నేతల్ని కలిసినట్లుగా చెబుతారు.ఈ సందర్భంగా సంఘ్ ఆగ్రనాయకత్వానికి ఒక అనుసంధానకర్తగా వ్యవహరించారు. తన పేరును ప్రకాశ్ గా మార్చేసి పోలీసులకు కళ్లు గప్పేవారు.

ఎప్పటికప్పుడు తన రూపాల్ని మార్చేసుకునే మోడీ.. పోలీసులకు చిక్కుండా జాగ్రత్తలు తీసుకునే వారు. ఆ సందర్భంగా ఆయన ప్రదర్శించిన చురుకుదనం.. సృజనాత్మకత సంఘ్ పరివార్ లో ఆయన పేరు మారుమోగేలా చేసింది. అదే.. ఆయన భవిష్యత్ రాజకీయాలకు బాటగా మారిందని చెబుతారు. ఎమర్జెన్సీ చీకటి రోజుల గురించి ప్రస్తావిస్తూ.. తాజాగా నిర్వహించిన ఒక సమావేశంలో కాంగ్రెస్ పార్టీని తూర్పార పట్టారు. అత్యవసర పరిస్థితిని విధించి 43 ఏళ్లు అయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మోడీ. ఇలాంటివేళే.. మోడీ ఎలా పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చుకున్నారన్న వైనం బయటకు రావటం గమనార్హం.