మురుగదాస్ వార్నింగ్ కలకలం!

0

`స్పైడర్` సినిమాను మినహాయిస్తే దర్శకుడిగా మురుగదాస్ ట్రాక్ సూపర్. సరికొత్త కథల్ని జనరంజకంగా తెరకెక్కించడంలో దర్శకుడు మురుగదాస్ శైలే వేరు. ఆయన నుంచి సినిమా వస్తున్నదంటే ప్రేక్షకుల్లో వుండే ఆసక్తి ప్రత్యేకమైనది. చూడటానికి చాలా కూల్గా కనిపించే ఈ జీనియస్ తన టీమ్ కే వార్నింగ్ ఇవ్వడం ప్రస్తుతం తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు మురుగదాస్ తన అసిస్టెంట్లు – టీమ్ కి ఎందుకు వార్నింగ్ ఇచ్చారు? అన్న టాక్ నడుస్తోంది.

ప్రస్తుతం విజయ్ హీరోగా మురుగదాస్ `సర్కార్` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తమిళంలో సమకాలీన రాజకీయాంశాల నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రమిది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ `మెర్సల్` తరువాత విజయ్ చిత్రానికి మరోసారి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 6న విడుదలకు సిద్ధమవుతున్నది. కాగా ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా తన అనుమతి లేకుండా ఎవరైనా మీడియాకు ఇంటర్య్వూలు ఇవ్వరాదని టీమ్ సభ్యులకు మురుగదాస్ వార్నింగ్ ఇస్తూ ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశారు.

“సర్కార్` చిత్ర బృందానికి విజ్ఞప్తి. ఈ సినిమా కోసం చాలా మంది తమ కష్టాన్ని ధారపోశారు. కొందరు జూనియర్ ఆర్టిస్ట్ లు ఇంటర్య్వూలు ఇస్తున్నారు. నా అనుమతి లేకుండా సినిమా గురించి ఎవరైన ఇంటర్య్వూలు ఇస్తే వారిపై భవిష్యత్తులో చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది` అని ట్వీట్ చేయడం ప్రస్తుతం తమిళ చిత్ర వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సెట్లో వుండే జూనియర్ ఆర్టిస్టుల వల్ల సినిమా కథ రివీలైతే అది సినిమాకు ప్రమాదంగా మారే అవకాశం వుందని గమనించిన మురుగదాస్ టీమ్ సభ్యులకు వార్నింగ్ ఇచ్చినట్లు చిత్ర బృందం చెబుతోంది.
Please Read Disclaimer