దుర్భరంగా శశికళ జైలు జీవితం

0Chinnamma-in-jailతనను ప్రత్యేక ఖైదీగా పరిగణించాలన్న అభ్యర్థనను న్యాయమూర్తి అశ్వథ నారాయణ తోసిపుచ్చడంతో అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి శశికళకు జైల్లో అత్యంత దుర్భర పరిస్థితులు ఎదురుకానున్నాయి. జైలు జీవితం తనకు కొత్త కాదని ఇంతకుముందు శశికళ చెప్పినా.. ఒకప్పుడు ఆమె ఎదుర్కొన్న జైలు జీవితం వేరు.. ఇప్పటి జైలు జీవితం వేరు.

ఇదే అక్రమాస్తుల కేసులో 2014లో జయలలితతో పాటు పరప్పన జైలుకు వచ్చిన శశికళ.. అమ్మతో సమానంగా ప్రత్యేక హోదాను జైల్లో అనుభవించారు. ప్రత్యేక బ్యారక్, ఫ్యాన్, 24గంటలు నీరు వచ్చే టాయిలెట్ తదితర సౌకర్యాలను అప్పట్లో ఆమె పొందారు.

దుర్భరమైన జైలు జీవితం:

అయితే ఇప్పటి సీన్ మాత్రం పూర్తిగా భిన్నమైనది. మిగతా ఖైదీల్లాగే శశికళ కూడా తన జైలు జీవితాన్ని గడపాల్సి ఉంటుంది. అది ఎంత దుర్భరంగా ఉంటుందంటే.. ఒక్కోసారి టాయిలెట్ లోకి అడుగుపెట్టాలంటేనే జుగుప్స కలిగించేలా. బ్యారక్ లోని టాయిలెట్ లో తెల్లవారు జామున ఒక గంటపాటు మాత్రమే నీరు వస్తుంది.

కంపుకొట్టే టాయిలెట్స్:

తెల్లవారుజామునే టాయిలెట్ కు వెళ్లే అలవాటు లేనివాళ్లు ఆ తర్వాత అందులోకి అడుగుపెట్టడం దుస్సాహసమే అవుతుందనడంలో అతిశయోక్తి లేదేమో!. ఎప్పుడూ కంపు కొట్టే ఆ టాయిలెట్స్ ను వాడటం అంత సులువేమి కాదు.

మురికి కూపాన్ని తలపించే జైలు:

ఒకసారి అక్కడికెళ్లొచ్చిన వారిని కదిలిస్తే.. జైల్లో ఎంతటి దుర్భర పరిస్థితులు ఉంటాయో అర్థమవుతుంది. మూడేళ్ల నుంచి సున్నం కూడా వేయని గోడలు, లోపలంతా మురికి కూపాన్ని తలపించే వాతావరణం, కొత్తగా వచ్చేవాళ్లను భయకంపితులను చేస్తాయని అంటున్నారు.

ములాఖత్ లు కూడా కష్టమే:

ప్రస్తుతం శశికళకు జైల్లో క్యాండిల్స్ ను తయారుచేసే పని అప్పగించడంతో మిగతా ఖైదీల్లాగే రోజంతా శశికళ ఆ పనిలో ఉండాలి. దీంతో అన్నాడీఎంకె నేతలతో ములాఖత్ లు కూడా అంతగా కుదరకపోవచ్చు. జైల్లో ఉండే తన ప్రత్యర్థులను దెబ్బతీయాలన్న శశికళ వ్యూహాలు ఇక్కడినుంచి అమలు చేయడం అంత సులువుగా జరిగే పని కాదు.

ప్రత్యేక ఖైదీ హోదా కోసం ప్రయత్నాలు:

ఒకవేళ శశికళను ప్రత్యేక ఖైదీగా గనుక చూస్తే.. విషయం వెంటనే బయటకు పొక్కే అవకాశముండటంతో అలాంటి వాటికి అవకాశం లేదనే చెప్పాలి. దీంతో శశికళకు వెంటనే ప్రత్యేక ఖైదీ స్టేటస్ వచ్చేందుకు అన్నాడీఎంకె నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఫలిస్తే.. శశికళకు ఈ బాధలు తప్పుతాయి.. లేదంటే మరో మూడున్నరేళ్లు ఈ మురికి కూపంలో మగ్గిపోవాల్సిందే.

తప్పనిసరై నడుం వాల్చి:

శశికళ ఆమె మేనకోడలు ఇళవరసిని ఒకే బ్యారక్ లో ఉంచడంతో.. వీరిద్దరు రాత్రి 11గం. వరకు సహా ఖైదీలతో ముచ్చటించినట్టు తెలుస్తోంది. అయితే లైటు ఆర్పివేయాలని తోటి ఖైదీలు కోరడంతో తప్పనిసరై శశికళ నడుం వాల్చారు. అయితే ఎంత ప్రయత్నించినా ఆమెకు నిద్రపట్టలేదని బ్యారక్ కు కాపలాగా ఉన్న సెంట్రీ తెలిపారు.

పులిహోరా టిఫిన్.. పొద్దున్నే న్యూస్ పేపర్

గతంలో జైలు శిక్ష అనుభవించినప్పుడు కొంతమంది మహిళా పోలీసులతో శశికళకు పరిచయం ఏర్పడింది. నిన్న జైల్లో శశికళ వారిని గుర్తుపట్టి పలకరించినట్టుగా చెబుతున్నారు. ఉదయం పూట శశికళకు న్యూస్ పేపర్ కావాలని కోరడంతో ఆంగ్ల పత్రికలను వెంటనే తెచ్చివగా.. తమిళ పేపర్ 7గం. తర్వాతే వస్తాయని చెప్పినట్టు తెలుస్తోంది. అల్పాహారంగా పులిహోరను అందించినట్టు తెలుస్తోంది.