ఎస్‌బీఐ వినియోగదారులూ జాగ్రత్త!

0sbi-card-holdersస్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో అకౌంట్‌ వాడుతున్నారా… అయితే ఈ వార్త మీకోసమే.. ఎస్‌బీఐకి చెందిన పలు అకౌంట్లలో మీకు తెలియకుండానే డెబిట్‌ అవుతోంది. తరచూ వాడే ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డు వివరాలు హ్యాక్‌కు గురైనట్లు సమాచారం. తాజాగా గత 20రోజులుగా ఎస్‌బీఐ వినియోగదారులకు తెలీకుండానే ఖాతాలోని డబ్బు మాయమవుతోంది. దీనిపై ఇప్పటికే అనేక మంది వినియోగదారులు ఎస్‌బీఐకి ఫిర్యాదు చేశారు. గత 20రోజులుగా పెద్ద ఎత్తున సైబర్‌ నేరాలు జరుగుతున్నాయి.

ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డుల ద్వారా దేశ విదేశాల్లో వేలాది రూపాయలను అక్రమంగా తస్కరిస్తున్నారు. అందరూ ఎంతో జాగ్రత్తగా ట్రాన్సాక్షన్స్‌ చేస్తున్నా తమ ఖాతాల్లో అమౌంట్‌ ఎలా కట్‌ అవుతున్నాయో అర్థం కాక వినియోగదారులు సతమతమవుతున్నారు. వినియోగదారులు తమ కార్డు వివరాలు, సీవీవీ నెంబర్లు, ఓటీపీ ఎవరికీ చెప్పకపోయినా తమ ఖాతా నుంచి డబ్బు ట్రాన్సాక్షన్‌ చేసినట్లు మెస్సేజ్‌, నోటిఫికేషన్‌ వస్తోంది. ముఖ్యంగా ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డులు వినియోగదారులకు ఆష్ట్రేలియా, అమెరికాలో తమ కార్డులు వినియోగించినట్లు, డాలర్ల రూపంలో ఖర్చు చేస్తున్నట్లు, అంతే కాకుండా కార్డు లిమిట్‌ అయిపోయిందని నోటిఫికేషన్లు వస్తున్నాయని తరచూ ఫిర్యాదులు అందుతున్నాయి.

అలాగే కొందరు నెట్ బ్యాంకింగ్ ఉపయోగించే వినియోగదారుల ఖాతానుంచి లక్షల్లో డెబిట్‌ అవుతున్నాయి. కొన్నిసార్లు ఓటీపీకూడా రాకుండానే అమౌంట్ కట్ అవుతోంది. గత కొన్ని రోజుల నుంచి తరచూ ఇలాంటి సంఘటనలు నమోదు అవుతుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. వీటన్నింటి నుంచి జాగ్రత్తగా ఉండాలంటే తరచూ మీ లాగిన్‌ పిన్‌, మార్చుకోవాలి. బ్యాంకు తరపు నుంచి మీ వివరాలు చెప్పమంటూ ఎటువంటి ఫోన్లు, ఈ మెయిల్స్‌ రావు. అలా వచ్చినట్లయితే వాటిని విస్మరించండి. సమస్యాత్మకంగా ఉంటే కార్డును బ్లాక్‌ చేసి కొత్త కార్డుకు దరఖాస్తు చేసుకోవడం మంచిది.