నరేంద్ర మోడీ సభ సమీపంలో పాట్నాలో రెండో పేలుడు

0blast-at-modi-meetingపాట్నా: బీహార్ రాజధాని పాట్నాలోని రైల్వే స్టేషన్లో ఆదివారం ఓ నాటు బాంబు పేలిన గంటన్నర వ్యవధిలో మరో పేలుడు సంభవించింది. రైల్వే స్టేషన్లో ఉదయం పదకొండు గంటలకు మొదటి బాంబు పేలగా, రెండో బాంబు పన్నెండున్నర గంటలకు పేలింది. ఇది ఓ సినిమా థియేటర్ సమీపంలో పేలింది. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు.
రెండో బాంబు పేలిన ప్రముఖ ఎల్పిన్‌స్టోన్ సినిమా హాలు సమీపంలోనే గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ హూంకార్ ర్యాలీలో ప్రసంగించనున్నారు. మోడీ ఒకటి, రెండు గంటల మధ్య ర్యాలీలో ప్రసంగిస్తారు. ఆయన రాకకు ముందు రెండు పేలుళ్లు జరగడంతో మోడీ సభకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

మొదటి బాంబు పేలుడు కేసులో ఎవరిని అదుపులోకి తీసుకోలేదు. పదకొండు గంటలకు పాట్నా రైల్వే స్టేషన్‌లోని పదో నెంబరు ప్లాటు ఫాం పైన బాంబు పేలింది. మరో బాంబును స్క్వాడ్ టాయిలెట్‌లో గుర్తించారు. ఇందుకు సంబంధించి ఎవరు అరెస్టు కాలేదు. మరోవైపు నరేంద్ర మోడీ పాట్నా విమానాశ్రయానికి పన్నెండున్నర గంటల సమయంలో చేరుకున్నారు. అక్కడి నుండి నేరుగా హూంకార్ ర్యాలీకి బయలుదేరారు.