రాజీనామాల రేస్ వెనుక రాజకీయం?

0

samayka-andhraరాష్ట్ర విభజన.. సీమాంధ్రను అగ్నిగుండంగా మార్చింది. మూడ్రోజులుగా ఎగిసిపడుతున్న నిరసన జ్వాలలకు నేతలు అల్లాడిపోతున్నారు. దీంతో విభజనపై నేతలు గేమ్ ప్లాన్.. మార్చారు. రాజీనామాలకు సిద్ధపడుతున్నారు. అయితే ప్రజాందోళనల నేపథ్యంలోనే నాయకులు రాజీనామాల మంత్రం జపిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అంతేకాక విభజనపై ప్రభుత్వ పెద్దలనే తప్పుబడుతూ నేతలు బాహాటంగా విమర్శలు గుప్పించేస్తున్నారు. ఇది కూడా ఓ ఎత్తుగడగానే కనిపిస్తోంది.

రాష్ట్ర విభజన ఎత్తుగడ రాష్ట్రనాయకులకు, ప్రభుత్వ పెద్దలకు ముందే తెలుసా? ముందే తెలిసీ.. సైలంట్ గా ఉన్నారా? ప్రస్తుతం జరుగుతున్న రాజీనామాలు కేవలం హంగామాయేనా? రాజీనామాల పర్వం, హడావిడి సమైక్య సమావేశాలు.. వ్యూహరచన పేరుతో చేస్తున్న షో నా? ప్రజాందోళనల వేడితో తప్పనిసరి పరిస్థితుల్లోనే నేతలు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారా? తాజా పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. వేర్పాటు వాదంపై మూడేళ్లుగా సాగుతున్న రచ్చ.. ఏడాదికాలంగా ఉధృతమైన..రాజకీయాలు, అధిష్టానంతో జరిగిన సమావేశాల సారాంశం తెలుసుకునేందుకు ఆసక్తి చూపని నేతలు.. అంతా అయిపోయాక ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ప్రభుత్వ పెద్దలు తమకేం చెప్పలేదని.. చెప్పి ఉంటే.. విభజనను అడ్డుకుని ఉండేవాళ్లమని అంటున్నారు.

ఢిల్లీలో జరిగిందేంటో ముందుగా తెలుసుకోలేకపోవడం.. సీమాంధ్ర నేతలను తీవ్రంగా ఇబ్బందిపెడుతోంది. సర్కార్ పై నమ్మకంతో.. సైలంట్ గా ఉన్న వీరంతా.. ప్రస్తుత పరిణామాలతో ప్రజలకు సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. దీంతో రాష్ట్ర విభజనపై కేంద్ర అభిప్రాయం తొలుతే వెల్లడించి ఉంటే.. ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఉండే వాళ్లమన్న భావన వారిలో నెలకొంది. అంతేకాక, చర్చల సారాంశం, అధిష్టానం మనసులో మాట చెప్పకుండా.. ప్రభుత్వ పెద్దలే తమను మోసం చేశారని కొందరు నేతలు బాహాటంగానే విమర్శలకు దిగుతున్నారు.

ఇక.. సీమాంధ్రలో మూడు రోజులుగా సాగుతున్న ఆందోళనలు, నిరసనల హోరు స్థానిక నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రాష్ట్ర విభజనపై కేంద్రం ప్రకటనతో ఆగ్రహంతో రగిలిపోతున్న ప్రజలు.. నేతలు ఇళ్లను ముట్టడించారు. ప్రజా దిగ్భంధంతో.. నాయకులు బయటకు రాలేక, ఇళ్లల్లో ఉండలేక సతమతమవుతున్నారు. ఒత్తిడి పెరిగిపోవడంతో నేతలు.. ఏదో ఒకటి చేసితీరాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకే.. ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాల బాట పట్టారు.

నేతల రాజీనామాల వ్యవహారం మరిన్ని కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చింది. రాజీనామాలకు కొందరు సిద్ధమైనా.. మరికొందరు మాత్రం వెనకడుగేయడం… అందులోనూ.. మంత్రులు ముందుకురాకపోవడం.. అధికార పార్టీలో అభిప్రాయబేధాలు ప్రస్ఫుటమవుతున్నాయి. రాష్ట్ర విభజనపై మంత్రులకు, ప్రభుత్వ పెద్దలకు ముందే తెలుసన్న నిర్ణయానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చేశారు. దీంతో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై మౌనంగా ఎందుకున్నారంటూ.. మంత్రులను నిలదీస్తున్నారు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల స్థాయిలో ఈ రేంజ్ లో వ్యతిరేకత వెల్లువెత్తడంతో సీమాంధ్ర మంత్రులు కూడా రాజీనామాలపై ఊగిసలాడుతున్నారు. మంత్రి పదవుల నుంచి తప్పుకుంటామని తొలుత ప్రకటించిన వారిలో కొద్దిమంది మినహా మిగతా వారు రాజీనామాలపై నోరుమెదపడంలేదు. రాజీనామాలు చేస్తే…అధిష్టానం ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందన్న భావన వారిలో నెలకొంది. గంటా శ్రీనివాసరావు, శైలజానాథ్, కాసు వెంకటకృష్ణారెడ్డి వంటి మంత్రులు రాజీనామాలకు కట్టుబడాల్సిందేనని చెబుతుండగా, మిగతా వారుమాత్రం రాజీనామాలపై సందిగ్ధంలో ఉన్నారు. రాజీనామా చేయకపోతే మంత్రులు నియోజకవర్గాల్లోకి వెళ్లలేని స్థితి నెలకొంది. ప్రజామెప్పు కోసం రిజైన్ చేస్తే ప్రభుత్వ పెద్దల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందనే భయం మరోవైపు వారిని వెంటాడుతున్నాయి.

పెద్దలు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసి ఏదో చేస్తున్నామన్న ఫిల్లర్స్ ఇచ్చి తమను మోసం చేశారని సీమాంధ్ర నాయకులు ఆరోపిస్తున్నారు. ఢిల్లీలో ఉన్నప్పుడు, తిరిగివచ్చినప్పుడు.. విభజనను అడ్డుకునేందుకు తెగ కష్టపడిపోతున్నట్లు బిల్డప్ ఇచ్చారని.. ముఖ్య నేతలంతా అంతా నాటకమాడి, జనాలను రోడ్లపైకి తీసుకొచ్చారని అంటున్నారు. ప్రస్తుత పరిస్థతి చూస్తుంటే.. ఆందోళనలకు అసలు కారణం ఇదే అని రుజువవుతోంది.

ఢిల్లీలో కాంగ్రెస్ నిర్ణయం ప్రకటించాక మిగతా పార్టీల వ్యూహాలలో, సీమాంధ్ర నేతల్లో కలకలం చెలరేగింది. పరిస్థితి చేయిదాటిపోతోందని, జనంలోకి వెళ్లే.. స్థితి లేదని నాయకులు గేమ్ మార్చి రాజకీయాలు చేస్తున్నారు. ఇదే ఊపులో మిగతాపార్టీలు రంగంలోకి దిగడంతో రాజీనామాల రేస్ ప్రారంభమైంది. ఆందోళనలు, రాజీనామాలు కాంగ్రెస్ చూడని పరిణామం కాదు. రాజకీయ పరిస్థితిని అనుకూలం చేసుకోవడం హస్తానికి కొత్తేంకాదు. అయితే.. ఈసారి సీన్ సీరియస్ గా ఉంది. ఆఖరిపోరాటం.. అంతిమ పరిష్కారం.. నినాదంతో సీమాంధ్రలో నిరసనలు మిన్నంటుతున్నాయి. రాష్ట్ర విభజనపై కట్టలు తెంచుకుంటున్న ఆందోళన.. కరెక్ట్ సమాధానం కావాలంటోంది.