సన్నీ లియోన్ తో తెలుగు దర్శకుడు!

0sunny-leone-and-Sekhar-Suriఎ ఫిలిం బై అరవింద్.. టాలీవుడ్లో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్లలో ఇదొకటని చెప్పొచ్చు. ‘అదృష్టం’ లాంటి ఫ్లాప్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన శేఖర్ సూరి.. రెండో ప్రయత్నంలో ఈ థ్రిల్లర్ మూవీతో మెప్పించాడు. హాలీవుడ్ థ్రిల్లర్లు చూస్తున్న భావన కలిగించింది ఈ చిత్రం. ఐతే శేఖర్ ప్రభ ఈ ఒక్క సినిమాకే పరిమితమైంది. ఆ తర్వాత అతను తీసిన ‘3’ కానీ.. ‘అరవింద్-2’ కానీ ఆకట్టుకోలేదు. ఐతే చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడతను ‘డాక్టర్ చక్రవర్తి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ శుక్రవారమే విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల దృష్టిని పెద్దగా ఆకర్షించలేకపోయింది. ఈ సినిమా విడుదలైన సంగతే జనాలకు తెలియని పరిస్థితి. సినిమా చూసిన వాళ్లు కూడా దీని గురించి అంత పాజిటివ్ గా మాట్లాడట్లేదు.

ఐతే శేఖర్ సూరి మాత్రం ‘డాక్టర్ చక్రవర్తి’కి మంచి స్పందన వస్తోందంటూ మీడియాను కలిశాడు. ఈ సందర్భంగా తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి అతను ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన తర్వాతి సినిమాను హిందీలో తీయబోతున్నానని.. సీనియర్ హీరో సంజయ్ దత్ కోసం ఓ కథ రాశానని.. ఆయనకది బాగా సూటవుతుందని.. త్వరలోనే దత్ కు కథ చెప్పబోతున్నానని తెలిపాడు శేఖర్. అలాగే ‘ఎ ఫిలిం బై అరవింద్’ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నట్లుగా వెల్లడించాడు శేఖర్. తెలుగులో షెర్లిన్ చోప్రా పోషించిన పాత్రను హిందీలో సన్నీ లియోన్ తో చేయించబోతున్నట్లుగా శేఖర్ చెప్పడం విశేషం. మరి శేఖర్ ట్రాక్ రికార్డు చూసి అతడికి అక్కడ అవకాశమిస్తోంది ఎవరో చూడాలి. అసలు సన్నీ ఈ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకుంటుందా?