పీఆర్వోల మీటింగ్.. సంచలన తీర్మాణాలు..

0తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇదో కొత్త ఒరవడి.. సినిమా పరిశ్రమలోని నటులు – ఇతర విభాగాల వారు అందరూ ఏకతాటిపై ఉన్నారు. ఒక్క పీఆర్వోల్లో మాత్రం ఇప్పటివరకూ ఐక్యత లేదు. ఈ మధ్య కాలంలో పీఆర్వోలు ఎక్కువవడం.. వాళ్లకు ప్రాధాన్యం పెరగడం.. వాళ్లలో వాళ్లకు కొన్ని గ్రూపులు ఏర్పడడం వల్ల ఓ వ్యవస్థ అంటూ పీఆర్వోలకు లేకుండా పోయింది. దీంతో ఎట్టకేలకు వారంతా సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 30మంది పీఆర్వోలు తాజాగా ఓ మీటింగ్ ను పెట్టారు. పీఆర్వోలు గ్రూపులుగా విడిపోయారనే ప్రచారాన్ని తిప్పి కొట్టడం ఈ మీటింగ్ ప్రధాన ఎజెండా.. దాంతో పాటు కొన్ని డిమాండ్లు – సమస్యలు పరిష్కరించకునేందుకు చర్చించారు.

చిత్ర పరిశ్రమలో పీఆర్వోలకు భాగస్వామ్యం కల్పించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఉన్న 24 క్రాఫ్టులలకు తోడుగా 25వ క్రాఫ్టుగా జర్నలిజాన్ని చేర్చాలని పీఆర్వోలు కోరుతున్నారు. ఇబ్బడిముబ్బడిగా పీఆర్వోలమని చెప్పుకుంటున్నవాళ్లకు చెక్ పెట్టాలని నిర్ణయించారు. పీఆర్వో కావాలంటే ఇక నుంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాలని తీర్మానించారు. పీఆర్వో అసోసియేషన్ లో సభ్యత్వం తీసుకుంటేనే అర్హులు అని తేల్చారు. అంతేకాదు రెండేళ్లుగా కనీసం రెండు సినిమాలు చేసి – ఒక్క సినిమా అయినా చేతిలో ఉన్న వాళ్లకే సంఘంలో సభ్యత్వం ఇవ్వాలని నిర్ణయించారు. ఇక కొత్తగా పీఆర్వో సభ్యత్వం పొందాలనుకునే వారు.. ఏదైనా సీనియర్ పీఆర్వో వద్ద 10 సినిమాలకు అసోసియేట్ గా పనిచేసి.. కనీసం 5 సినిమాలకు అయినా పీఆర్వోగా చేస్తేనే మెంబర్ షిప్ ఇవ్వాలని డిసైడ్ చేశారు.

పీఆర్వోల సంఘానికి మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని అప్పుడు కొత్త కార్యవర్గాన్ని ఎంచుకోవాలని పీఆర్వోలు తీర్మాణం చేశారు. తాత్కాలికంగా ఏర్పడ్డ పీఆర్వోల అసోసియేషన్ కు అధ్యక్షుడిగా సీనియర్ పాత్రికేయుడు – పీఆర్వో బి ఏ రాజును ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా వేణుగోపాల్ – సురేష్ కొండేటిలను ఏకగ్రీవంగా ఎంచుకున్నారు.