బిగ్‌బాస్‌: మేం ఉండలేం బాబోయ్‌!

0Bigg-Boss-Tamil-Shaktiతెలుగు బిగ్‌బాస్‌ రియాలిటీ షో కన్నా ముందే ప్రారంభమైన తమిళ బిగ్‌బాస్‌ షో విజయవంతంగా ఏడువారాలు పూర్తి చేసుకుంది. మొదట డల్‌గా ప్రారంభమైన ఈ షో పలు సంఘాల హెచ్చరికలు, వివాదాలు, ఒవియా ఆత్మహత్యాయత్నం ఎపిసోడ్‌తో ఊపందుకుంది. ఇప్పుడు తమిళనాట అత్యధిక మంది వీక్షిస్తున్న టీవీ షో ఇదే. దీని టీఆర్పీ రేటింగ్స్‌ ఆకాశాన్నంటుతున్నాయి.

అయితే, గతవారం ఒవియా అనూహ్యరీతిలో హౌజ్‌ నుంచి తప్పుకోవడం, జూలీని ఎలిమినేట్‌ చేయడంతో షోలో ఎగ్జైట్‌మెంట్‌ తగ్గిపోయింది. ఈ వారం ప్రముఖ దర్శకుడు పీ వాసు తనయుడు, నటుడు శక్తి హౌజ్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యాడు. ఎలిమినేషన్‌ జోన్‌లో ఉన్న ఆరవ్‌, బిందు మాధవి, గణేశ్‌ వెంకట్రామన్‌ మధ్య గట్టి పోటీ నెలకొన్నా.. అనూహ్య రీతిలో శక్తి షో నుంచి ఔట్‌ అయ్యాడు. పాపులారిటీ తెచ్చుకోవాలన్న తన లక్ష్యం ఈ షోతో నెరవేరిందని ఈ సందర్భంగా శక్తి పేర్కొన్నాడు. ఇక, డెంజర్‌ జోన్‌లో ఉన్న గాయత్రీ రఘురాం అనూహ్యంగా ఎలిమినేషన్‌ తప్పించుకోగా.. తమిళ బిగ్‌బాస్‌ షోలోని పలువురు కంటెస్టెంట్స్‌ మాత్రం తమను హౌజ్‌ నుంచి పంపించాలని వేడుకుంటున్నారు. బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఎంతమాత్రం ఉండలేమని చెప్తున్నారు. ముఖ్యంగా నటుడు, గీత రచయిత స్నేహన్‌ తనకు ఓటు వేయొద్దని అభిమానులను అభ్యర్థించాడు. తాను హౌజ్‌లో ఎంతమాత్రం ఉండలేనని, దయచేసి తనకు ఎవరూ ఓటు వేయొద్దని కోరాడు. తాను మరికొంత కాలం హౌజ్‌లో ఉంటే మరో వ్యక్తిలా మారిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. అయినా అతన్ని ఎమిలినేట్‌ చేయలేదు.

ఇక షోలోని ప్రముఖ కమెడియన్‌ వైయాపురి కూడా తనను హౌజ్‌ నుంచి పంపించమని వేడుకుంటున్నాడు. ‘నటుడ్ని అయ్యేందుకు నేను ఎన్నో కష్టాలు పడ్డాను. ఇప్పుడు అవే కష్టాలు మళ్లీ ఎందుకు పడాలో అర్థం కావడం లేదు. హౌజ్‌లో స్థానం కోసం పోరాడాల్సిన ఖర్మ నాకు లేదు. దయచేసి నన్ను ఇంటికి పంపించండి. ఈ క్రూరమైన ఆట నేను ఆడలేకపోతున్నా’ అంటూ వైయాపురి తన భార్యకు పంపిన మెసేజ్‌లో పేర్కొన్నాడు. మరోవైపు ఒవియా తప్పుకోవడంతో బిగ్‌బాస్‌ షోలో ఆసక్తి తగ్గిపోవడంతో ఆమెను మళ్లీ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీగా షోలోకి తీసుకొచ్చే అవకాశముందని అంటున్నారు.