‘2.0’ వాయిదాల కథ చెప్పిన శంకర్

0

Shankar-Explains-About-2-0-Movie-Release-Delayరోబో’ సీక్వెల్ ‘2.0’ ఎప్పుడో రావాల్సిన సినిమా. కానీ అనివార్య కారణాలతో వాయిదాల మీద వాయిదాలు పడి ఈ ఏడాది నవంబరు 29న విడుదలకు ముస్తాబవుతోంది. సినిమా ఇంత ఆలస్యం కావడానికి విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో జాప్యమే కారణమని భావిస్తున్నారు. ఐతే వాస్తవంగా ఏం జరిగిందన్నది ఎవరికీ తెలియదు. ఈ విషయంలో స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు శంకర్. తన గత సినిమా ‘ఐ’ చాలా ఆలస్యమైన నేపథ్యంలో ‘2.0’ విషయంలో మరీ ఎక్కువ సమయం తీసుకోకూడదని శంకర్ అనుకున్నాడట. ఈ చిత్రాన్ని తాను అనుకున్న ప్రకారమైతే ఏడాదిన్నర కిందటే రిలీజ్ చేయాల్సిందట. కానీ నిర్మాతలు కోరుకున్న బడ్జెట్ ఇచ్చి అన్ని రకాలుగా సహకరించాక విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో తాను రాజీ పడకపోవడంతో సినిమా ఆలస్యమైందని శంకర్ చెప్పాడు.

గత ఏడాది దీపావళి విడుదల ఖరారయ్యాక కొన్ని నెలలకు విజువల్ ఎఫెక్ట్స్ సంస్థ తమకు ఇంకా రెండు నెలలు అదనపు సమయం కావాలని చెప్పిందని.. దీంతో 2018 రిపబ్లిక్ డేకి రిలీజ్ డేట్ మార్చామని శంకర్ చెప్పాడు. ఆ డేటుకి ఫిక్సయి దుబాయిలో ఆడియో వేడుక ప్లాన్ చేసుకున్నామని.. ఐతే తాము ఆ వేడుకలో ఉండగానే వీఎఫెక్స్ సంస్థ నుంచి సమాచారం వచ్చిందని.. తమకు ఇంకా టైం కావాలని అన్నారని.. ఆడియో వేడుకకు భారీగా ఏర్పాట్లు జరగడంతో తాము వెనక్కి తగ్గలేకపోయామని.. రిలీజ్ డేట్ ఏప్రిల్ కు మార్చామని.. కానీ తర్వాత ఆ సంస్థ తమకు ఏకంగా ఏడాది సమయం కావాలంటూ మెలిక పెట్టిందని శంకర్ వెల్లడించాడు. దీంతో ఇక వాళ్లతో కుదరదని భావించి హాలీవుడ్లో ‘మార్వెల్ స్టూడియోస్’ కోసం పని చేసే వీఎఫెక్స్ సంస్థను సంప్రదించామని.. గత ఏడాది వాళ్లకు ‘బ్లేడ్ రన్నర్’ చిత్రానికి ఆస్కార్ అవార్డు కూడా వచ్చిందని.. ఐతే పాత సంస్థ నుంచి కంటెంట్ మొత్తం ఇక్కడికి తరలించడానికి చాలా సమయం శ్రమ అవసరమైందని.. ఇవన్నీ పూర్తి చేసి.. ఆ సంస్థ తాము కోరుకున్నట్లుగా ఔట్ పుట్ ఇచ్చాక.. అన్నీ చూసుకుని నవంబరు నెలాఖర్లో సినిమా రిలీజ్ చేయడానికి ఫిక్సయ్యామని శంకర్ తెలిపాడు.
Please Read Disclaimer