‘రోబో’ కథ నాదే…శంకర్ ‘కౌంటర్’!

0తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ జంటగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన `యందిరన్`(రోబో)బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ గా `రోబో 2.ఓ` త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ‘యందిరన్’ కథ తనదేనంటూ ఆరూర్ తమిళనాథన్ అనే దర్శకుడు మద్రాస్ హైకోర్టులో కేసు వేశారు. తాను రచించిన `జుగిబా`నవల ఆధారంగా ఆ చిత్రం తెరకెక్కిందని తమిళనాథ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో – ఆ పిటిషన్ పై శంకర్ స్పందించినట్లు తెలుస్తోంది. ఆ కథ తనదేనంటూ శంకర్ కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ సినిమా కథ తనదేనని… తమిళనాథన్ చెబుతున్న కథకు తన సినిమా కథకు చాలా వ్యత్యాసం ఉందని ఆయన పిటిషన్ లో పేర్కొన్నట్టు సమాచారం.

ఆ కథ తనదేనంటూ తమిళనాథన్….హైకోర్టును ఆశ్రయించారు. తనకు నష్టపరిహారంగా రూ.కోటి ఇప్పించాలని కోరారు. అయితే గత ఎనిమిదేళ్ల నుంచి ఈ కేసు పెండింగ్ లో ఉంది. ఈ ఏడాది 27న కోర్టుకు శంకర్ హాజరు కావాలని జడ్జి ఆదేశించారు. అయితే శంకర్ వెళ్లకుండా తన అసిస్టెంట్ డైరెక్టర్ ను కోర్టుకు పంపారు. దీంతో ఆగస్టు 8లోపు శంకర్ ఆ కథ తనదేనని నిరూపించుకోవాలని అందుకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే శంకర్ ఆ కథ తనదేనని క్లెయిమ్ చేస్తూ….మద్రాసు హైకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ కేసు వ్వవహారంపై శంకర్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.