భారతీయుడు-2.. ఏడేళ్ల ముందే మొదలు

0

భారతీయుడు’ సీక్వెల్ గురించి చాలా ఏళ్లుగా చర్చ నడుస్తోంది. ఎట్టకేలకు ఆ సినిమా నిజంగానే తెరమీదికి రాబోతోంది. శంకర్ ఆల్రెడీ స్క్రిప్టు రెడీ చేసి.. ప్రి ప్రొడక్షన్ పనుల్లో పడిపోయాడు. ఐతే 20 ఏళ్ల కిందట బ్లాక్ బస్టర్ హిట్టయిన ‘భారతీయుడు’కి సీక్వెల్ చేయమని తనకు ఎన్నో ఏళ్ల కిందటే ప్రపోజల్స్ వచ్చాయని శంకర్ చెప్పాడు. కానీ ‘భారతీయుడు’ బాగా ఆడింది కాబట్టి.. దానికి సీక్వెల్ చేస్తే క్రేజ్ ఉంటుంది కాబట్టి.. తీసేద్దాం అని తాను ఎప్పుడూ ఆలోచించలేదన్నాడు శంకర్. ‘రోబో’ సీక్వెల్ విషయంలోనూ తన ఆలోచన ఇలాగే ఉండదని.. సరైన కథ కుదిరినపుడే సీక్వెల్స్ చేయాలి అన్నది తన ఉద్దేశమని.. అందుకే ఈ రెండు సీక్వెల్స్ కూడా తనకు సరైన ఐడియాలు వచ్చినపుడే చేయాలన్న ఆలోచనకు వచ్చానన్నాడు.

‘భారతీయుడు-2’ విషయంలో తనకు సరైన ఐడియా ఏడేళ్ల కిందట వచ్చిందన్నాడు శంకర్. ఐతే ‘భారతీయుడు’ సినిమాలో అవినీతి సహా చాలా విషయాలు చూపించామని.. సీక్వెల్ తీయాలంటే అంతకుమించి కొత్తగా ఏదైనా చూపించాలని.. అలాంటి అంశాలే సీక్వెల్లో ఉంటాయని చెప్పాడు శంకర్. తన సినిమాల్లో ఎంత భారీతనం ఉన్నా.. ఎన్ని హంగులు ఉన్నా.. ఎంత బడ్జెట్ పెట్టినా.. అంతిమంగా కథకే అత్యంత ప్రాధాన్యం ఇస్తామని.. అది లేకుండా ఏ సినిమా తీసినా వేస్టే అని తాను నమ్ముతానని శంకర్ చెప్పాడు. ‘భారతీయుడు’ టైంలో అప్పటి పరిస్థితులు తననెంతగా ఆందోళనకు గురి చేసి సినిమా చేసేలా చేశాయో.. ఇప్పటి పరిస్థితులు కూడా తనలో అలాంటి కదలికే తెచ్చాయన్నాడు శంకర్. ఈ కాలంలో అవినీతితో పాటు ఇంకెన్నో సమస్యలు ఉన్నాయని.. వాటన్నింటినీ సినిమాలో చూపిస్తానని శంకర్ చెప్పాడు. ‘రోబో’.. ‘ఐ’.. ‘2.0’ సినిమాలతో విజువల్ ఎఫెక్ట్స్ కోసం కష్టపడి కష్టపడి అలసిపోయానని.. ‘భారతీయుడు-2’ ఆ శ్రమ లేకుండా చూసుకుంటానని శంకర్ స్పష్టం చేశాడు.
Please Read Disclaimer