చిన్న సినిమాలకు వచ్చేసిన పవన్ నిర్మాత!

0టాలీవుడ్ లోనే కాదు ఏ సినిమా పరిశ్రమలో అయినా సరే ఒక హీరో అండదండలతో ఎదుగుతున్న బ్యానర్ సడన్ గా తాను సినిమాలు మానేయడం వల్లనో లేక తగ్గించుకోవడం వల్లనో విడిపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అది ప్రత్యక్షంగా చవిచూస్తున్నారు నిర్మాత శరత్ మరార్. ప్రొడ్యూసర్ గా కంటే పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడిగా మెగా ఫాన్స్ లో బాగా గుర్తింపు తెచ్చుకున్న శరత్ మరార్ పవన్ తో తీసిన రెండు సినిమాలు చేదు ఫలితాలు మిగల్చడం బాగా ఇబ్బంది పెట్టింది. సర్దార్ గబ్బర్ సింగ్ తో దెబ్బ తిన్నాక కోలుకునే ఉద్దేశంతో కాటమరాయుడు చేస్తే అది కూడా నెగటివ్ రిజల్ట్ ఇచ్చింది. పవన్ ఎలాగూ సినిమాలు చేసే ఉద్దేశంలో లేడని ముందే గుర్తించిన శరత్ ప్రత్యాన్మయంగా వేరే సినిమాల వైపు మళ్లాడు. విజయ్ లాంటి క్రేజీ హీరో మూవీ కాబట్టి ఇక్కడ కూడా బాగా ఆడుతుంది అనే ఉద్దేశంతో మెర్సల్ ని అదిరింది పేరుతో డబ్ చేస్తే వివిధ కారణాల వల్ల విడుదల ఆలస్యమై అక్కడ బ్లాక్ బస్టర్ అయిన సినిమా ఇక్కడ యావరేజ్ గా మిగిపోయింది.

ఇప్పుడు ఈయన ప్రేమకు రైన్ చెక్ అనే చిన్న సినిమాతో వస్తున్నాడు. అసలు ఈ సినిమా నిర్మాణంలో ఉందన్న సంగతి కూడా ఎవరికి తెలియదు. అభిలాష్-ప్రియలను జంటగా పరిచయం చేస్తూ ఆకెళ్ళ పేరి  శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ట్రైలర్ ఇటీవలే విడుదల చేసారు. పనిచేసే ఆఫీస్ లో కొలీగ్స్ తో ప్రేమలో పడితే ఎన్ని రకాల సమస్యలు వస్తాయనే థీమ్ తో రూపొందిన ఈ ప్రేమకు రైన్ చెక్ మీద ఇప్పటికి అంచనాలు పెద్దగా లేవు. అయినా పవన్ లాంటి స్టేచర్ ఉన్న హీరోతో సినిమా చేసే రేంజ్ నుంచి ఇలా కొత్త తారలతో బడ్జెట్ సినిమా తీసేదాకా రావడానికి  కారణం పవన్ పాలిటిక్స్ లోకి రావడమా లేక రిస్క్ ఎందుకులెమ్మని చిన్న సినిమాలతో సెటిలయ్యే ప్రయత్నమా ఆయనకే తెలియాలి. అయినా సురేష్ బాబు మొదలుకుని అల్లు అరవింద్ దాకా బాగున్న కంటెంట్ తో చిన్న సినిమాలు తీసిన పెద్ద ప్రొడ్యూసర్లు ఎందరో ఉన్నారు. ఆ లెక్కన చూసుకుంటే శరత్ మారార్ వీటి వైపు టర్న్ తీసుకోవడం విశేషం కాదు కానీ ఒకరకంగా మంచి నిర్ణయమే అనుకోవచ్చు.