మంగళూరు రోడ్ల మీద షార్క్ లు..పాములు

0ఇదేదో హరర్ సినిమా ఎంత మాత్రం కాదు. మంగళూరు లాంటి సిటీ రోడ్ల మీదకు షార్క్ లు.. పాములు రావటం ఏమిటి? జనాలు రోడ్ల మీదకు రావటానికి వణికిపోవటం ఏమిటి? అన్న సందేహం అక్కర్లేదు. ఎందుకంటే.. గడిచిన నాలుగు రోజులుగా అక్కడ వర్షం దుమ్మెత్తి పోస్తోంది. నాన్ స్టాప్ గా పడుతున్న వర్షాలతో అక్కడి జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

విడవకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర అవస్థలకు గురి అవుతున్నారు. వర్షాల కారణంగా ఆరేబియన్ సముద్రంలో భారీ అలలు ఎగిసిపడటంతో సముద్రపు నీటితో పాటు అరు అడుగుల షార్క్ ఒకటి మంగళూరు వీధుల్లోకి వచ్చి పడింది.

దీన్ని గుర్తించిన వ్యక్తి ఒకరు..కొక్కెంతో దాన్ని రోడ్డు మీదకు ఈడ్చుకు వెళ్లారు. దీంతో.. అది చనిపోయింది. మరోవైపు రోడ్ల మీద నిలిచిన నీళ్లలో ఐదు అడుగుల పాము ఒకటి కనిపించింది. తమ పక్క నుంచే విషపూరితమైన పాము ఒకటి వెళ్లటంతో స్థానికులు హడలిపోతున్నారు.

విషపూరిత జంతువులు వీధుల్లో నిలిచిన నీళ్లల్లో దర్శనమివ్వటంతో.. రోడ్ల మీదకు రావటానికి కూడా మంగళూరు ప్రజలు భయానికి గురి అవుతున్నారు. వీధుల్లో నీళ్లు తగ్గే వరకూ ఇలాంటి పరిస్థితి తప్పదని చెబుతున్నారు.