శర్వానంద్.. విరాట పర్వం 1992

0యువ కథానాయకుడు శర్వానంద్ సినిమాల ఎంపికలో చాలా ప్రత్యేకంగా కనిపిస్తాడు. రొటీన్ మసాలా సినిమాలకు అతను దూరం. ప్రతి సినిమాలోనూ వైవిధ్యం కోరుకుంటాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా సాగిపోయే ఈ హీరో ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ‘పడి పడి లేచె మనసు’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటుగా అతను సుధీర్ వర్మ దర్శకత్వంలోనూ ఓ సినిమా మొదులపెట్టాడు. అది కూడా సమాంతరంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవలే శర్వా మరో కొత్త సినిమా కూడా కమిటయ్యాడు. ‘నీదీ నాదీ ఒకే కథ’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన వేణు ఉడుగుల దర్శకత్వంలో అతను నటించబోతున్నాడు.

90వ దశకం నేపథ్యంలో సాగే ఈ విభిన్న ప్రేమకథకు ‘విరాట పర్వం 1992’ అనే టైటిల్ నిర్ణయించినట్లు సమాచారం. ఈ చిత్రంలో సాయిపల్లవి కథానాయికగా నటించనున్నట్లు ఇంతకుమందే వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కొంతమేర అటీవీ నేపథ్యంలోనూ సాగుతుందట. ‘రంగస్థలం’ స్టయిల్లో అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ కొంచెం ‘రా’గా ఈ సినిమా తీయాలని భావిస్తున్నాడట వేణు. తొలి సినిమాను పరిమిత బడ్జెట్లో పూర్తి చేసిన వేణుకు ఈసారి శర్వా లాంటి హీరో దొరకడంతో బడ్జెట్ విషయంలో వెసులుబాటు లభించింది. శర్వా ఫ్రీ అవ్వడానికి ఇంకా కొన్ని నెలలు సమయం పట్టేలా ఉండటంతో వేణు ప్రశాంతంగా స్క్రిప్టు తీర్చిదిద్దుకునే అవకాశం లభించింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతోంది.