ఆ నిర్మాత నన్ను లైంగికంగా వేధించాడు: నటి శిల్పా

0Shilpa-Shinde‘బాబీజీ ఘర్‌ పర్‌ హై’ నటి శిల్పా షిండే నిర్మాత సంజయ్‌ కోహ్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిర్మాత కోహ్లి తనను లైంగికంగా వేధించాడని, అసభ్యంగా ప్రవర్తించాడని ముంబైకి సమీపంలోని వాల్వీ నైగావ్‌ పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ‘బాబీజీ ఘర్‌ పర్‌ హై’ షోతో శిల్పా పాపులర్‌ అయింది. ఆ షో నిర్మాత సంజయ్‌ కోహ్లితో ఆమెకు విభేదాలు ఉన్నట్టు తెలుస్తోంది. షో కాంట్రాక్టులో ఎక్స్‌క్లూజివ్‌ క్లాజ్‌ పెట్టడాన్ని తప్పుబడుతూ.. నిర్మాత తనను మానసికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ గత ఏడాది ఆమె షో నుంచి తప్పుకుంది. దీంతో తనకు నష్టం వచ్చిందంటూ రూ. 12.5 కోట్ల దావాను శిల్పాపై నిర్మాత కోహ్లి వేశారు.

తాజాగా శిల్పా ఇచ్చిన ఫిర్యాదులో.. సంజయ్‌ తరచూ తనతో సన్నిహితంగా వ్యవహరించేందుకు ప్రయత్నించేవాడని, తనను హాట్‌, సెక్సీ అని అసభ్యంగా పిలిచేవాడని పేర్కొంది. తనను ఒకసారి అసభ్యంగా తాకాడని, దాంతో తాను గట్టిగా నో చెప్పానని తెలిపింది. ఈ విషయం గురించి బయట చెప్తే షో నుంచి తీసేస్తానని బెదిరించాడని పేర్కొంది. ఆ తర్వాత రోజు మేకప్‌ రూమ్‌లోకి వచ్చి షోలో కొనసాగాలంటే తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని చెప్పాడని, దీనిని మేకప్‌ మ్యాన్‌ వినడంతో అతన్ని తొలగించాడని తెలిపింది. అయితే, తనపై శిల్పా షిండే పెట్టిన కేసు బూటకమని, ఆమె తప్పుడు ఆరోపణలు తనపై చేస్తున్నారని నిర్మాత సంజయ్‌ కోహ్లి అంటున్నారు.