బాలకృష్ణపై శ్రీయా సెన్సేషనల్ కామెంట్స్..

0Shriya-saran-sensational-commentsదక్షిణాది చిత్ర పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన శ్రీయా సరన్ కొన్నాళ్లుగా ఆ మెరుపులు మెరిపించడం లేదు. కానీ తాజాగా ఆమె అంగీకరించిన సినిమాలు చూస్తే ఆమె కెరీర్ మళ్లీ గాడిన పడినట్టు కనిపిస్తున్నది. నటసింహ బాలకృష్ణ 100వ చిత్రంగా ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకొన్న గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంలో ఆమె వశిష్ఠిదేవిగా తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఆ చిత్రం తర్వాత మళ్లీ బాలకృష్ణ చిత్రంలో నటించే అవకాశాన్ని చేజిక్కించుకొన్నది.

శ్రీయా సరన్ నటిస్తున్న తాజా చిత్రం పైసా వసూల్. ఈ చిత్రం ద్వారా మరోసారి బాలకృష్ణ సరసన నటిస్తున్నది. పైసా వసూల్ చిత్రంలో జర్నలిస్టుగా శ్రీయ కనిపించనున్నది. జర్నలిస్టుగా పనిచేసే తాను బాలకృష్ణను ఎలా కలిశానన్నదే తన పాత్ర నేపథ్యం అని ఇటీవల శ్రీయా సరన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

వంద చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించకొన్న బాలకృష్ణతో నటించడం నా అదృష్టం. అంతేగానీ నేను నటించడం వల్ల ఆయన సినిమాలు బాగా ఆడుతున్నాయి అనే ప్రశ్న సరికాదు. నేను ఈ ఏ హీరోకు కూడా లక్కీ హీరోయిన్ కాదు. బాలకృష్ణనే నాకు లక్కీ హీరో. ఆయనతో నటించిన సినిమాలన్నీ ఘన విజయం సాధించాయి అని శ్రీయ సరన్ పేర్కొన్నది. బాలకృష్ణతో నటించడం ఇది మూడోసారి. ఆయనతో నటించిన అన్ని చిత్రాలు ఘన విజయం సాధించాయి అని ఆమె అన్నారు.

పూరీ జగన్నాథ్ గురించి శ్రీయ సరన్ మాట్లాడుతూ.. దక్షిణాదిలో మంచి దర్శకుల్లో పూరీ ఒకరు. చాలా మంది కొత్త దర్శకులతో పనిచేసిన అనుభవం ఉంది. ప్రతి ఒక్కరు నన్ను తెరమీద అద్భుతంగా చూపించారు. పైసా వసూల్ చిత్రంలో తన పాత్రను పూరీ జగన్నాథ్ అద్భుతంగా డిజైన్ చేశారు అని చెప్పారు.

నక్షత్రం సినిమా కథ నచ్చడం వల్లే ఆ చిత్రంలో ఐటెం సాంగ్ చేశాను. ఆ చిత్ర కథను కృష్ణవంశీ చక్కగా చెప్పారు. ఆ చిత్రంలో కీలక సన్నివేశంలో వచ్చే పాట అది. సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుందనే కారణంతో ఐటెం సాంగ్‌కు ఓకే చెప్పాను. ఆ పాట నాకు చాలా సంతృప్తిని కలిగించింది అని శ్రీయా సరన్ వెల్లడించారు.

శ్రీయా సరన్ నటించే తదుపరి సినిమా వీర భోగ వసంతరాయలు. ఈ చిత్రంలో నారా రోహిత్, సుధీర్‌బాబు హీరోలు. ఈ చిత్రంలో శ్రీయా సరన్ తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నది. ఈ చిత్రం సైకాలజికల్ థ్రిల్లర్. ఇప్పటివరకు నేను పోలీస్ పాత్రను పోషించలేదు. పోలీస్ పాత్రను ధరించడం పట్ల చాలా సంతోషంగా ఉంది అని శ్రీయ సరన్ పేర్కొన్నది.