ట్రైలర్ టాక్: అన్నదమ్ముల అల్లరి

0అల్లరి నరేష్-సునీల్ కాంబోలో చాలా ఏళ్ళ తర్వాత వస్తున్న సినిమా సిల్లీ ఫెలోస్. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ట్రైలర్ ఇందాకా విడుదల చేసారు. ట్రైలర్ లోనే కథలో ఏముండొచ్చు అనే క్లూలు చాలా క్లియర్ గా ఇచ్చేసిన టీమ్ హాస్య ప్రియులను టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది. కథ కూడా లీలగా చెప్పేసారు. నరేష్-సునీల్ ఇద్దరూ జయప్రకాష్ రెడ్డి సంతానం. ఏదో సంఘటన వల్ల మతి స్థిమితం కోల్పోయిన జయప్రకాష్ రెడ్డి ఐదు వందల కోట్లకు సంబంధించిన ఓ రహస్యాన్ని తన కడుపులోనే దాచుకుంటాడు. దాని కోసం రాజా రవీంద్ర-పోసాని బ్యాచ్ వేట మొదలుపెడతారు. ఈ క్రమంలో అన్నదమ్ములు ఇద్దరు ప్రేమలో పడటం నాన్నకు సంబందించిన వివాదంలో తమాషాగా ఇరుక్కోవడం ఇదంతా ఒక ఫార్ములా ప్రకారం నీట్ గా సెట్ చేసుకున్నట్టున్నారు. సుడిగాడుతో గతంలో అల్లరి నరేష్ కు ఓ భారీ హిట్ ఇచ్చిన దర్శకుడు భీమినేని శ్రీనివాస రావు కామెడీ పరంగా అందరిని మెప్పించేందుకు గట్టి ప్రయత్నాలే చేసినట్టు కనిపిస్తోంది.

హీరోయిన్ ఇన్స్ పెక్టర్ పాత్రలో కనిపించగా ఆమెను ప్రేమలో పడేసేందుకు సునీల్ చెప్పిన టిప్స్ దానికి వాడిన డైలాగ్స్ ఆరెక్స్ 100 లాంటి కొత్త సినిమాల రిఫరెన్స్ లు ఇదంతా బాగానే పేలేలా ఉంది. ట్రైలర్ లో కథకు సంబంధించిన కీలకమైన హింట్స్ ఇచ్చేసిన సిల్లీ ఫెలోస్ టీమ్ కంటెంట్ మీదే ఎక్కువ ఫోకస్ ఉంది. ఈ మధ్య బిగినింగ్ టు ఎండింగ్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చి మెప్పించిన సినిమా ఏదీ లేదు కాబట్టి సిల్లీ ఫెలోస్ కు అది ప్లస్ పాయింట్ గా మారనుంది. పోసానితో రాజమౌళికి సారీ చెప్పించడం తమాషాగా ఉంది. సుడిగాడు ఛాయలు లేకపోలేదు. ఇన్స్ పెక్టర్ గా బ్రహ్మానందం పెద్ద కం బ్యాక్ ఇస్తున్నారు. మొత్తానికి అటు సునీల్ ఇటు నరేష్ లతో పాటు దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు కు సైతం పెద్ద హిట్ కావాల్సిన తరుణంలో వస్తున్న సిల్లీ ఫెలోస్ హాస్య ప్రియులను మెప్పించడంలో ఎంత వరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.