భూవివాదంలో శిల్పా మోహన్ రెడ్డి..!

0silpa-mohan-reddy-faces-bitవైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి మెడకు వివాదం చుట్టుకుంది. శిల్పా దళితుల భూములు ఆక్రమించారంటూ పెద్ద ఎత్తున దళితులు ఆర్టీవో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.

శిల్పా మోహన్ రెడ్డి దళితుల భూములు ఆక్రమించారని వారు ఆరోపణలు చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చాబోలు గ్రామంలో రెండున్నర ఎకరాల భూమిని శిల్పా మోహన్ రెడ్డి ఆక్రమించారని, ఆ భూములు తిరిగి తమకు అప్పగించాలని కోరారు.

ఈ సందర్భంగా బాధితులు తమతో మాట్లాడినట్లు ఓ టీవీ ఛానల్ పేర్కొంది. తన భూమి తనకు తిరిగి ఇవ్వాలని, తన కొడుకులను మోసం చేసి శిల్పా భూములను రాయించుకున్నారని, అది చెల్లదని, తన పేరుమీద భూమి ఉందని బాధితులు చెప్పారని పేర్కొన్నారు.

చెరువు కుంటకని తన కొడుకుల ద్వారా బలవంతంగా భూమి తీసుకున్నారని, ఆ విషయం తనకు తెలియదని, ఆ పత్రాలపై తన సంతకం కూడా లేదని బాధితులు తెలిపారు. తన భూమి కావాలని, అందరూ కలిసి తనకు న్యాయం చేయాలని కోరారు.

దీనిపై ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకర రావు మాట్లాడారు. శిల్పా మోహన్ రెడ్డి చాబోలు గ్రామానికి చెరువు కుంటకోసం దళితుల భూమిని తీసుకున్నారని, మార్తమ్మ అనే మహిళకు చెందిన భూమిని చెరువుకుంట పేరుతో తీసుకున్నారని, వెంటనే నేషనల్ హైవే రావడం, దానికి ఆ భూమిని శిల్ప అమ్మడం జరిగిందన్నారు.

మార్తమ్మకు రూపాయి ఇవ్వలేదని జూపూడి ఆరోపించారు. బాధితులు పదిహేనేళ్లుగా పోరాటం చేస్తున్నారని, ఇంతవరకు పరిష్కారం కాలేదన్నారు. ఇతరులకు చెందిన ఏడున్నర ఎకరాల భూమిని కూడా శిల్పా తీసుకున్నారని ఆరోపించారు. దీనిపై శిల్పా మోహన్ రెడ్డి ఏం మాట్లాడాతారో చూడాలంటున్నారు.