శ్రమించి నెగ్గిన సింధు

0PV-Sindhu-in-Malaysia-Openగతవారం మలేసియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ టోర్నమెంట్‌లో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించిన భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు… సింగపూర్‌ ఓపెన్‌లో మాత్రం అతికష్టమ్మీద తొలి రౌండ్‌ అడ్డంకిని దాటింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ సింధు 10–21, 21–15, 22–20తో ఆల్‌ ఇంగ్లండ్‌ మాజీ చాంపియన్, ప్రపంచ 10వ ర్యాంకర్‌ నొజోమి ఒకుహారా (జపాన్‌)పై కష్టపడి గెలిచింది. 62 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌లో తడబడింది. రెండో గేమ్‌లో ఒకదశలో స్కోరు 6–6 వద్ద ఉన్నపుడు ఈ హైదరాబాద్‌ అమ్మాయి ఒక్కసారిగా చెలరేగింది. వరుసగా తొమ్మిది పాయింట్లు నెగ్గి 15–6తో ముందంజ వేసింది. అదే జోరులో రెండో గేమ్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్‌లో సింధు ఆరంభంలో వరుసగా మూడు పాయింట్లు గెలిచి 3–0తో ఆధిక్యంలోకి వెళ్లింది.

ఆ తర్వాత ఒకుహారా తేరుకోవడంతో మ్యాచ్‌ పోటాపోటీగా సాగింది. స్కోరు 9–8 వద్ద ఉన్నపుడు సింధు విజృంభించి వరుసగా ఏడు పాయింట్లు గెలిచి 16–8తో విజయానికి చేరువైంది. స్కోరు 20–14 వద్ద సింధు విజయానికి ఒక పాయింట్‌ దూరంలో ఉన్నపుడు… ఒకుహారా వరుసగా ఆరు పాయింట్లు గెలిచి స్కోరును 20–20తో సమం చేసింది. అయితే సింధు ఒత్తిడికి లోనుకాకుండా వరుసగా రెండు పాయింట్లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకుంది. ఈ గెలుపుతో సింధు, ఒకుహారా ముఖాముఖి రికార్డులో 3–3తో సమమయ్యారు. చివరిసారి వీరిద్దరూ 2016 రియో ఒలింపిక్స్‌ సెమీఫైనల్లో తలపడగా… సింధు పైచేయి సాధించింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఫిత్రియాని (ఇండోనేసియా)తో సింధు తలపడుతుంది. మహిళల సింగిల్స్‌ మరో తొలి రౌండ్‌ మ్యాచ్‌లో రితూపర్ణ దాస్‌ (భారత్‌) 18–21, 13–21తో సు యా చింగ్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడిపోయింది.

పురుషుల సింగిల్స్‌లో మిశ్రమ ఫలితాలు

మరోవైపు పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. శ్రీకాంత్, సాయిప్రణీత్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించగా… సౌరభ్‌ వర్మ, సమీర్‌ వర్మ, అజయ్‌ జయరామ్‌ తొలి రౌండ్‌లో ఓడిపోయారు. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో శ్రీకాంత్‌ 21–12, 21–11తో నిషిమోటో (జపాన్‌)పై, సాయిప్రణీత్‌ 17–21, 21–7, 21–19తో ఎమిల్‌ (డెన్మార్క్‌)పై గెలిచారు. సౌరభ్‌ వర్మ 15–21, 14–21తో ఆంథోనీ జిన్‌టింగ్‌ (ఇండోనేసియా) చేతిలో, సమీర్‌ వర్మ 26–28, 21–23తో హు యున్‌ (హాంకాంగ్‌) చేతిలో, జయరామ్‌ 16–21, 7–21తో షి యుచి (చైనా) చేతిలో ఓటమి పాలయ్యారు.

మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి–అశ్విని ద్వయం 21–19, 21–19తో యున్‌ లూ లిమ్‌–యాప్‌ చెంగ్‌ వెన్‌ (మలేసియా) జోడీపై గెలుపొందగా… పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సుమీత్‌ రెడ్డి–మనూ అత్రి జంట 8–21, 16–21తో కమురా–సోనోడా (జపాన్‌) ద్వయం చేతిలో ఓడింది.