తన పెళ్లి వార్తలపై సునీత క్లారిటీ!

0



టాలీవుడ్ సింగర్ సునీత గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న సంగతి తెలిసిందే. త్వరలోనే సునీత పెళ్లికూతురు కాబోతోందని – ఓ టెకీని సునీత వివాహం చేసుకోబోతోందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోన్న ఈ వార్తలపై తాజాగా సునీత …. ఫేస్ బుక్ లైవ్ చాట్ లో ఘాటుగా స్పందించారు. ఇతరుల వ్యక్తిగత జీవితాలపైనే ఎక్కువ ఆసక్తిని ఎందుకు చూపిస్తారంటూ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. తన పెళ్లి గురించి వస్తోన్న వార్తలను సునీత ఖండించారు. ఆ పుకార్లు అర్థ రహితమని – వాటిని ఎందుకు సృష్టిస్తారో తనకు అర్థం కాదని మండిపడ్డారు. తానెవరినీ పెళ్లి చేసుకోవడం లేదని….కొన్ని వెబ్ సైట్లు – సోషల్ మీడియాలో వస్తోన్న పుకార్లకు అడ్డుకట్ట వేసేందుకే ఫేస్ బుక్ లైవ్ కు వచ్చానని సునీత క్లారిటీ ఇచ్చారు.

ప్రస్తుతం తన పెళ్లి గురించి మాట్లాడేందుకు సమయం కాదని…సందర్భం అంతకన్నా కాదని సునీత అన్నారు. నెల రోజుల క్రితమే తన నాయనమ్మ చనిపోయారని – ప్రస్తుతం ఆ పనుల్లో తాను తీరిక లేకుండా ఉన్నానని అన్నారు. అందువల్లే ఆ పుకార్లపై స్పందించడానికి కొంత సమయం పట్టిందని చెప్పారు. కానీ గత రాత్రి నుంచి తనకు చాలామంది ఫోన్ చేసి ఈ పెళ్లి గురించి అడుగుతున్నారని….శుభాకాంక్షలు చెబుతూ చాలా మెసేజ్ లు కూడా వస్తున్నాయని సునీత అన్నారు. అందుకే ఆ పుకార్లపై క్లారిటీ ఇచ్చేందుకు ఫేస్ బుక్ లైవ్ కు వచ్చానని చెప్పారు. అయితే తాను మళ్లీ చేసుకొని సంతోషంగా ఉండాలని ఇంతమంది మిత్రులు – సన్నిహితులు కోరుకోవడం ఆనందంగా ఉందన్నారు. అయితే ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని – భవిష్యత్తులో ఆ ఆలోచన వస్తే స్వయంగా తానే ప్రకటిస్తానని చెప్పారు.