వినాయక చవితి.. సోనాలి ఎమోషనల్ పోస్ట్

0తెలుగు ప్రేక్షకులను పలు చిత్రాలతో అలరించి బాలీవుడ్లో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన సోనాలి బింద్రే గత కొంత కాలంగా హైగ్రేడ్ క్యాన్సర్ తో పోరాడుతున్న విషయం తెల్సిందే. సోనాలి క్యాన్సర్ విషయం తెలియగానే ఆమె అభిమానులు మరియు సినీ వర్గాల వారు షాక్ అయ్యారు. అయితే ఆమె మాత్రం చాలా ధైర్యంగా క్యాన్సర్ తో పోరాడుతున్నారు. తన ఆరోగ్యంకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తున్న సోనాలి బింద్రే ఇటీవలే తన జుట్టును తీసేయడం వంటి పోస్ట్ పెట్టి అందరి హృదయాలను ద్రవింపజేసిన విషయం తెల్సిందే.

తాజాగా వినాయక చవితి సందర్బంగా సోనాలి మరోసారి ఎమోషనల్ పోస్ట్ పెట్టి అందరి దృష్టిని ఆకర్షించారు. నాకు ఎంతో ఇష్టమైన పండుగ వినాయక చతుర్ధి ప్రతి సంత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మా ఇంట్లో వినాయక చతుర్ది పూజ జరిగింది. కాని నేను ఈసారి అక్కడ లేను. ఈసారి వినాయక చవితి సెలబ్రేషన్స్ మిస్ అవుతున్నా. అయినా పర్వాలేదు నాకు దేవుడు ఆశీస్సులు ఉన్నాయి. మీ అందరికి పండుగ శుభాకాంక్షలు. ప్రేమ సంతోషాలతో మీ జీవితాలు సాగాలని కోరుకుంటున్నాను అంటూ సోనాలి సోషల్ మీడియాలో వినాయక చవితి శుభాకాంక్షలను తెలిపారు.

ఎమోషనల్ పోస్ట్ తో పాటు తన కొడుకు రణ్వీర్ వినాయక చతుర్ధి జరుపుకుంటున్న ఫొటోలను కూడా షేర్ చేయడం జరిగింది. సోనాలి పోస్ట్ కు భారీ ఎత్తున జనాలు రెస్పాండ్ అయ్యారు. మీరు త్వరగా కోలుకోవాలని – వచ్చే వినాయక చతుర్ధిని మీరు మీ కుటుంబ సభ్యులతో జరుపుకోవాలి అంటూ ఆమె అభిమానులు కామెంట్స్ చేశారు. సోనాలికి మరియు ఆమె కుటుంబ సభ్యులకు పెద్ద ఎత్తున వినాయక చతుర్థి శుభాకాంక్షలు వెళ్లువెత్తాయి.