మణికర్ణిక నుంచి ఆయనా ఔట్!

0క్వీన్ కంగన ప్రస్తుతం `మణికర్ణిక` చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. స్వాతంత్య్ర సమరయోధురాలు ఝాన్సీ లక్ష్మీ భాయ్ పాత్రలో నటిస్తోంది. ఈ పాత్ర కోసం కంగన మార్షల్ ఆర్ట్స్ ని నేర్చుకుంది. వారియర్ క్వీన్‌లా కనిపించేందుకు తొలి నుంచి ఎంతో శ్రమిస్తోంది. అయితే ఇలాంటి భారీ హిస్టారికల్ మూవీ తెరకెక్కిస్తున్నప్పుడు కొన్ని అడ్డంకులు – ఇబ్బందులు తప్పవు. ప్రస్తుతం అలాంటి సన్నివేశమే ఎదుర్కొంటోంది కంగన.

గత కొంతకాలంగా దర్శకుడు క్రిష్‌తో విభేధాలు రావడంతో ఆ ఇద్దరి మధ్యా ఏదీ సరిగా కుదరలేదని ప్రచారమైంది. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ తో క్రిష్ బిజీగా ఉండడంతో అది నిజమేనని అంతా భావిస్తున్నారు. పనిలో పనిగా `దర్శకత్వం: కంగన` అంటూ క్లాప్ బోర్డ్ లో కనిపించడంతో క్రిష్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టేనన్న ప్రచారం సాగుతోంది. క్రిష్ తప్పుకోలేదు అంటూనే కంగన స్వీయ దర్శకత్వంలో ప్యాచ్ వర్క్ ని పూర్తి చేసేస్తోంది.

తాజాగా మరో ఊహించని సన్నివేశం మణికర్ణిక టీమ్‌కి ఎదురైంది. కొన్ని సన్నివేశాల్లో నటించాక.. ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నానని సోనూసూద్ ప్రకటించాడు. చివరి నిమిషంలో మణికర్ణిక టీమ్ మార్పులు చెప్పడంతో అతడు ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ప్రస్తుతం `సింబా` చిత్రంలో నటించేందుకు ప్రిపరేషన్ లో ఉన్న సోనూ సూద్ బాగా గడ్డం పెంచాడు. అతడు మణికర్ణిక షూట్ లో పాల్గొనాలంటే ఆ గడ్డం తీసేసి – క్లీన్ షేవ్ తో కనిపించాల్సి ఉంటుంది. కానీ అందుకు ససేమిరా! అని అంటున్నాడు సోనూ. `సింబా`కి కమిటయ్యాను. మాట తప్పలేను అని తెలిపాడు. తన ప్లేస్ లో వేరొకరితో చిత్రీకరణ పూర్తి చేయాల్సిందిగా కోరుతూ మణికర్ణిక టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. కమిట్ మెంట్ విషయంలో ఎంతో నిబద్ధతతో ఉండే సోనూసూద్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఒకవేళ తాను మణికర్ణిక షూటింగ్ లో పాల్గొనాలంటే `సింబా` షెడ్యూల్ పూర్తయ్యాక గడ్డం లేకుండా ఎటెండవుతానని – అంత వరకూ వేచి చూడలేని పరిస్థితిలో తన పోర్షన్ మొత్తం వేరొకరితో షూట్ చేస్కోండని ఖరాకండిగా తేల్చి చెప్పేశాడు సోనూ. ఒకరికి ఇచ్చిన కమిట్ మెంట్ లో మార్పు ఉండదని తెలిపాడు. దీంతో మరోసారి మణికర్ణిక టీమ్ సందిగ్ధంలో పడినట్టయ్యింది. మొత్తానికి ఈ హిస్టారికల్ సినిమాకి ఆదిలోనే బోలెడన్ని అడ్డంకులు తప్పడం లేదని అర్థమవుతోంది.