తప్పు ఒప్పుకున్న రజినీ కూతురు

0soundarya-appears-in-courtసూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్లో ప్రేక్షకుల్ని తీవ్రంగా నిరాశ పరిచిన సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ వాటన్నింట్లోకి నెంబర్ వన్ అంటే ‘కోచ్చడయాన్’ అనే చెప్పాలి. ఈ సినిమా గురించి ఏదో ఊహించుకుని వెళ్తే ఇంకేదో చూపించింది రజినీ కూతురు సౌందర్య. ముఖ్యంగా రియల్ రజినీని కాకుండా యానిమేటెడ్ రజినీ చూడటం అభిమానులకు ఎంతమాత్రం నచ్చలేదు. బొమ్మల సినిమా అంటూ ‘కోచ్చడయాన్’ను తిప్పికొట్టేశారు ప్రేక్షకులు. ఇంతోటిదానికి రూ.120 కోట్ల బడ్జెట్టు.. రెండేళ్ల పాటు రజినీ సమయం వృథా అంటూ విమర్శలు గుప్పించారు. కూతురి ముచ్చట తీర్చడానికి రజినీ ఇంత రిస్క్ చేశాడేంటని ఆశ్చర్యపోయారు.

ఐతే ‘కోచ్చడయాన్’ ఫెయిల్యూర్ గురించి రజినీ కానీ.. సౌందర్య కానీ ఎప్పుడూ పెద్దగా మాట్లాడింది లేదు. ఐతే ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని.. తన బావ ధనుష్ కథానాయకుడిగా ‘వీఐపీ-2’ సినిమా తీసిన సౌందర్య.. ఎట్టకేలకు ‘కోచ్చడయాన్’ గురించి స్పందించింది. ఆ సినిమా విషయంలో తప్పు జరిగిందని ఒప్పుకుంది. ‘‘ఆ సినిమాకు ఉపయోగించిన టెక్నాలజీ అప్పటికి పూర్తిగా కొత్త. ఆ సినిమాలో యానిమేషన్ గురించి ప్రేక్షకులు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. అయినా అభిమానులందరూ నాన్నను రియల్ గా చూడాలనుకుంటారు. నేను యానిమేషన్ ద్వారా చూపించడం వారికి నచ్చలేదు. అందుకే ఆ సినిమా పరాజయం పాలైంది’’ అంటూ వాస్తవాన్ని అంగీకరించింది సౌందర్య. ‘కోచ్చడయాన్’ తెలుగులోకి ‘విక్రమసింహా’ పేరుతో విడుదలై ఇక్కడా అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. ‘వీఐపీ-2’ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.