హీరోలు, అభిమానులపై బాలు కామెంట్స్!

0SP-BalaSubrahmanyamఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు కోపం వచ్చింది. ఆయన తెలుగు వాళ్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మన హీరోలు.. వారి అభిమానుల తీరును ఎండగట్టారు. జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు పేరు రాకపోవడానికి మన వాళ్లలో అంకిత భావం లేకపోవడమే కారణమన్నారు. రోటరీ క్లబ్ నుంచి జీవిత కాల సాఫల్యపురస్కారం అందుకున్న సందర్భంగా బాలు సంచలన ప్రసంగం చేశారు. ఆయనేమన్నారంటే..

‘‘లబ్దప్రతిష్టులయిన హీరోలు తెలుగు జాతి కోసం భాష గర్వపడేలా ఒక్క సినిమా తేయలేరా? ఎంత సేపూ కేరళ కర్ణాటక వాళ్లకు అవార్డులు వెళ్లిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారే కానీ.. ఎంత మంది తమ అభిమాన ఆర్టిస్టులను దేశం గర్వించే సినిమాలు తీస్తారా? అని ప్రశ్నించగలుగుతున్నారా? ‘దంగల్’ సినిమాను ఆమిర్ ఖాన్ ఒక్కడే చేయగలడా? మనం ఎందుకు చేయలేకపోతున్నాం? అని ప్రతి ఒక్క ప్రేక్షకుడు.. అభిమాని ఆత్మ విమర్శ చేసుకోవాలి.

సినీ ప్రేక్షకుల పరిస్థితి సంకెళ్లు వేసుకున్న నపుంసకుల్లా మారిపోయింది. సినిమాల్లో నచ్చని అంశంపై నోరెత్తితే ఏ అభిమానులు వచ్చి ఇళ్లపై రాళ్ల వర్షం కురిపిస్తారోనని భయపడాల్సి వస్తోంది. తమ హీరోలకు జాతీయ అవార్డులు రావడం లేదని గోల చేసే అభిమానులు.. సోకాల్డ్ ఫ్యాన్స్.. ఆ స్థాయిలో సినిమాలు చేయడం లేదని ఎందుకు ప్రశ్నించరు? ఈ అభిమానులు తమ ఆర్టిస్టులను ప్రశ్నించగలిగిన రోజే జాతి గర్వించదగ్గ సినిమాలు వస్తాయి. అగ్ర కథానాయకులు కళాత్మక సినిమాలపై దృష్టి సారించాలి. హీరోలు కనీసం ఒక్క సినిమా అయినా జాతిజజ భాష కోసం చేయాలి.

పెద్ద సినిమాలు వస్తున్నాయంటే చాలు రాష్ట్రంలోని వేల థియేటర్లను ఆ నిర్మాతలు బుక్ చేసుకుంటున్నారు. మరి చిన్న సినిమాలను ఎక్కడ ఆడించాలి? ‘మిథునం’ సినిమాకు ఓవర్సీస్ నుంచి కూడాఅభినందనలు అందయి. కానీ తెలుగు రాష్ట్రంలో చూస్తే 10 థియేటర్లకు మించి ప్రదర్శించలేని పరిస్థితి’’ అంటూ బాలు ఆవేదన స్వరంతో మాట్లాడారు.