బిగ్ బాస్ 3 : ఇంతకంటే ఫన్నీ పుకారు ఉండదు

0

తెలుగులో బిగ్ బాస్ మొదటి సీజన్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే రెండవ సీజన్ మాత్రం పలు కారణాల వల్ల వివాదాస్పదం అయ్యింది. అయితే కౌశల్ ఆర్మీ కారణంగా షో బాగానే టీఆర్పీని దక్కించుకుంది. ఇప్పుడు మూడవ సీజన్ గురించిన చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. మూడవ సీజన్ కు ఎవరు హోస్టింగ్ చేస్తారు ఎవరు అయితే మూడవ సీజన్ కు న్యాయం చేస్తారంటూ ఎవరికి తోచిన అంచనాలు వారు వేసేసుకుంటున్నారు. ఇప్పటి వరకు నిర్వాహకుల నుండి ఎలాంటి లీక్ కాని లీడ్ కాని అందలేదు. కాని సోషల్ జనాలు మాత్రం ఇష్టం వచ్చినట్లుగా అనేసుకుంటున్నారు.

నిన్న మొన్నటి వరకు అదుగో చిరంజీవి ఇదుగో వెంకటేష్ అంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఇప్పుడు మాత్రం మరో వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది. ఆ వ్యక్తే కౌశల్. అవును బిగ్ బాస్ సీజన్ 2 విజేత అయిన కౌశల్ సీజన్ 3కి హోస్టింగ్ చేయబోతున్నట్లుగా కొందరు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. కౌశల్ అయితేనే బిగ్ బాస్ సీజన్ 3ను సరిగా హోస్టింగ్ చేస్తాడంటూ కొందరు పోస్ట్ చేస్తున్నారు. మా వారు కూడా కౌశల్ పేరును పరిశీలిస్తున్నట్లుగా చెబుతున్నారు.

ఏ భాషలో బిగ్ బాస్ వచ్చినా కూడా దాన్ని ఒక స్టార్ హీరో లేదా ఒక స్టార్ తో హోస్టింగ్ చేయిస్తున్నారు. అలాగే తెలుగులో చేస్తారు. అంతే తప్ప కౌశల్ కు ఎట్టి పరిస్థితుల్లో కూడా హోస్టింగ్ బాధ్యత ఇవ్వరు. అలా ఇస్తే పార్టిసిపెంట్స్ కూడా ఆసక్తి చూపరనే విషయం నిర్వాహకులకు కూడా తెలుసు. అందుకే అంత పెద్ద తప్పు చేయరు. బిగ్ బాస్ పై వస్తున్న పుకార్లలో ఇదే అతి పెద్ద ఫన్నీ పుకారుగా చెప్పుకోవాలి. ఇలాంటి చెత్త పుకార్లు ముందు ముందు మరెన్ని వినాల్సి వస్తుందో చూడాలి.
Please Read Disclaimer