బిగ్ బాస్ లో వివాదాస్పద క్రికెటర్!!

0ఇండియన్ బుల్లి తెరను షేక్ చేస్తున్న అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్. హిందీలో దాదాపు పుష్కర కాలంగా కొనసాగుతూ వస్తున్న బిగ్ బాస్ ఈమద్య సౌత్‌లో కూడా ప్రారంభం అయ్యింది. తెలుగు – తమిళం మరియు మలయాళంలో ఈ షో జరుగుతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం తెలుగు మరియు తమిళంలో రెండవ సీజన్ ప్రసారం అవుతుంది. ఇక త్వరలో హిందీలో 12వ సీజన్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈమద్యే 12వ సీజన్ కు సల్మాన్ ఖాన్ దాదాపుగా 250 కోట్ల పారితోషికంను అందుకోబోతున్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. అత్యధిక టీఆర్పీ రేటింగ్ రావడంతో పాటు భారీ ఎత్తున స్పాన్సర్స్ ఈ షో కోసం క్యూ కడుతున్న కారణంగా ఈసారి మరింత ఆసక్తికరంగా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.

హిందీ బిగ్ బాస్ 12వ సీజన్‌కు హోస్ట్‌గా సల్మాన్ దాదాపుగా ఖరారు అయినట్లే అంటూ బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఇక షోలో పాల్గొనబోతున్న పార్టిసిపెంట్స్ గురించి సోషల్ మీడియాలో మరియు వెబ్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పలు వార్తలు పార్టిసిపెంట్స్ గురించి వచ్చాయి. తాజాగా మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివాదాస్పద క్రికెటర్ శ్రీశాంత్ ను బిగ్ బాస్ లోకి తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. భారీ ఎత్తున పారితోషికం ఇచ్చి మరీ ఆయన్ను ఎంపిక చేసేందుకు హిందీ బిగ్ బాస్ షో నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారట. ప్రతి సీజన్ లో ఏదో ఒక వివాదాస్పద అంశం ఉండేలా నిర్వాహకులు ప్లాన్ చేస్తూ ఉంటారు. ఈసారి శ్రీశాంత్ ద్వారా షోకు గ్లామర్ తీసుకు రావాలని భావిస్తున్నారట.

టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ గా చిన్న వయస్సులోనే మంచి గుర్తింపు దక్కించుకుని – పలు కీలక సిరీస్ ల్లో కీలక వికెట్లు తీసిన శ్రీశాంత్ 2013 ఐపీఎల్ సందర్బంగా స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్నాడు. బీసీసీఐ నుండి సస్పెన్షన్ కు గురైన శ్రీకాంత్ కొన్నాళ్లు జైలు జీవితంను కూడా గడిపిన విషయం తెల్సిందే. శ్రీశాంత్ కేసు ఇప్పటికి కోర్టులోనే ఉంది. ఈ సమయంలోనే ఈయన సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని భావిస్తున్నాడు. క్రికెట్ కు పూర్తిగా దూరంగా ఉంటున్న శ్రీశాంత్ ఆమద్య ఒక తెలుగు సినిమాలో కూడా నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈయన బిగ్ బాస్ లో కనిపించే అవకాశం ఉంది అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతున్న హిందీ బిగ్ బాస్ సీజన్ 12 లో ఇంకా పలువురు బాలీవుడ్ స్టార్స్ కూడా ఉండబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలన్నింటికి షో ప్రారంభం అయిన తర్వాత సమాధానం లభించే అవకాశం ఉంది.