అలాంటి మొగుడు కావాలి.. శ్రీదేవి

0Srideviనాలుగు దశాబ్దాలు.. 300 సినిమాలు.. సినిమా పరిశ్రమలో ఇది శ్రీదేవి అల్ టైమ్ రికార్డు. వచ్చేనెల సినిమాల్లోకి ప్రవేశించి 50 ఏళ్లు పూర్తవుతాయి. 1967 జూలై 7వ తేదీన తొలిసారి సినిమా షూటింగ్‌లో పాల్గొన్నది. బాలతారగా ఆమె కెమెరా ముందు నిలుచున్నది. ప్రస్తుతం శ్రీదేవి మామ్ అనే చిత్రంలో నటిస్తున్నది. ఈ సందర్భంగా తన కూతురుకు ఎలాంటి మొగుడు కావాలో అనే విషయాన్ని ఆమె వెల్లడించడం చర్చనీయాంశమైంది.

తన భర్త బోని కపూర్ గురించి చెప్తూ తన తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత బోని నాకు తండ్రిగా, తల్లిగా, భర్తగా మారాడు. మేము పెళ్లి చేసుకొని 22 ఏళ్లు అయిపోయింది. అయితే మా కాపురంలో ఎలాంటి ఇబ్బంది లేదు అని శ్రీదేవి చెప్పింది.

పెళ్లి జరిగి ఇన్నాళ్లయినా గానీ నాపై ప్రేమాభిమానాలను కురిపిస్తుంటాడు. నా గురించి మాట్లాడేటప్పుడు ఆయన కళ్లలో మెరుపు కనిపిస్తుంటుంది. ఆయన కళ్లు చూస్తే నాపై ఎంత ప్రేమ ఉంటుందో తెలుస్తుంది. ఇప్పటికి నా అందం గురించి పొగుడుతుంటాడు. అంతకంటే నాకు కావాల్సింది ఏముంటుంది అని శ్రీదేవి అన్నారు.

మా ఇంట్లో ఉండే వాతావరణం వాళ్ల స్నేహితుల ఇళ్లలో కనిపించదని నా కూతుళ్లు చెప్తుంటారు. నాన్నలా ప్రేమలా కురిపించే భర్తలు కావాలని నా పిల్లలు చెప్తుంటారు అని శ్రీదేవి చెప్పారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమంలో శ్రీదేవి మాట్లాడుతూ.. తన పిల్లలు సినిమాల్లోకి ప్రవేశించడం తనకు ఇష్టం లేదని, వారికి పెళ్లి చేసి పంపిస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని ఆమె పేర్కొనడంతో మీడియా షాక్ తిన్నది. ఎందుకంటే శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో శ్రీదేవి మాటలు షాకివ్వడం పరిపాటి అయింది.

నేను నటించిన సినిమాలను నా పిల్లలు ఇప్పటివరకు చూడలేదు. వారికి చూపించదలచుకోలేదు. మిస్టర్ ఇండియా, మరికొన్ని సినిమాలు తప్ప చాలా వరకు నా సినిమాలు చూడలేదు.

నా కూతురు జాహ్నవి సినిమాల్లో నటించాలని చెప్పినప్పుడు చాలా షాక్ తిన్నాను. ఈ విషయాన్ని బోనితో చెప్పాను. నా కోపం రాలేదు కానీ ఎందుకో ఒప్పుకోవడం కష్టమైంది. అయితే కొద్ది రోజులపాటు ఆలోచించిన తర్వాత మేము కూడా మానసికంగా సిద్ధపడినాం.

ఎందుకంటే నాకు పిల్లలంటే చాలా ఇష్టం. వారి కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధం. వారి కోసం కెరీర్‌ను కూడా త్యాగం చేస్తున్నాను. ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాను నాకు ఖాళీగా ఉన్న సమయంలోనే చేశాను. వారికి స్కూల్ సెలవులు ఉన్న సమయంలో దాదాపు రెండు నెలల్లో సినిమాను పూర్తి చేశాను. నాకు దర్శకుడు బాల్కీ ఫ్రెండ్ కావడంతో పూర్తి స్వేచ్ఛ లభించింది అని శ్రీదేవి చెప్పారు.

పార్టీలకు, పబ్బులకు వెళ్లకుండా జాహ్నవి, ఖుషీ కపూర్‌లను కట్టడి చేస్తాను. రాత్రంతా పార్టీలలో మునిగి తేలి.. దినమంతా పడుకునే పద్ధతి వద్దని హెచ్చరించాను. ఇప్పుడు ఇంట్లో వారికి కర్ఫ్యూ లాంటి వాతావరణం ఉంది. వాళ్లు బయటకు వెళ్లిన ప్రతిసారి ఫోన్ చేసి తెలుసుకొంటాను. రోజులు మునపటిలా లేవు. వారు బయటకి వెళితే నాకు భయమేస్తుంది. అభద్రతాభావంతో ఉంటాను అని చెప్పింది.