‘మా’ నిధులు: శ్రీకాంత్ చాలెంజ్ – నరేష్ డుమ్మా

0మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో అవినీతి ఆరోపణలు కలకలం రేపాయి. ఇటీవల అమెరికాలో చేసిన ప్రోగ్రాంకు సంబంధించిన నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ‘మా’ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీనియర్ నరేష్ అకౌంట్స్ పుస్తకాలు చెక్ చేశారని ఏదో తేడా కొట్టిందనే వార్తలు లీక్ అయ్యాయి. ఈ నిధుల దుర్వినియోగం వెనుక హీరో శ్రీకాంత్ ఉన్నట్టు మీడియాలో వార్తలు రావడంతో మా అసోసియేషన్ అంతా సోమవారం కదిలి వచ్చింది. అధ్యక్షుడు శివాజీ రాజా – ట్రెజరర్ పరిచూరితో కలిసి సోమవారం శ్రీకాంత్ విలేకరుల మందుకు వచ్చి వివరణ ఇచ్చారు.

కొన్ని రోజుల క్రితం అమెరికాలో సిల్వర్ జూబ్లీ కార్యక్రమం నిర్వహించారు. మెగా స్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వచ్చిన నిధులు దుర్వినియోగం జరిగినట్లు మీడియాలో వార్తలు రావడంతో టాలీవుడ్ షేక్ అయ్యింది.

అమెరికా ఈవెంట్లో చిరంజీవి పాల్గొన్నా అంత తక్కువ డబ్బులు వచ్చాయా అని విలేకరుల ప్రశ్నించగా.. దీనికి శ్రీకాంత్ సమాధానమిచ్చారు. ‘చిరంజీవి సపోర్టే మాకు స్టామినా.. అమెరికాలో ప్రోగ్రాం నిర్వహించడానికి 50 మంది మెంబర్స్ వెళ్లాం.. వారికి ఫ్లైట్ ఖర్చులు – లోకల్ ట్రావెలింగ్ – ఫైవ్ స్టార్ హోటల్ ఖర్చులు చాలా అవుతాయి.. పైగా అది అమెరికాలో భారీగానే ఉంటుంది. అన్నింటికి లెక్కలున్నాయని.. చిరంజీవి స్టామినా గురించి అలా విమర్శలు చేయడం సరైంది కాదని’ సమాధానమిచ్చారు.

మెగాస్టార్ చిరంజీవిని ప్రోగ్రాంకు తీసుకువస్తున్నామని.. అమెరికా నిర్వాహకులకు తాము చాలా డబ్బులు డిమాండ్ చేశాం.. కానీ ఆర్గనైజర్లు కొంతవరకే ఇస్తామని అనడంతో అవే తీసుకున్నామని శ్రీకాంత్ – శివాజీరాజా వివరణ ఇచ్చారు..

ఈ సమయంలో మీడియా మిత్రులు.. ‘చిరంజీవి ప్రోగ్రాం అమెరికాలో విజయ్ అనే వ్యక్తి సెట్ చేశాడని.. సెట్ చేసినందుకు రామకృష్ణ రాజు అనే వ్యక్తి ద్వారా రూ.80 లక్షలు బినామీ అకౌంట్లోకి వెళ్లినట్లు ఆరోపణలు వస్తున్నాయని’ మా సభ్యులను ప్రశ్నించారు.

దీనికి శ్రీకాంత్ సమాధానమిచ్చారు.. మాతో చేసుకున్న ఒప్పందం ప్రకారమే మేము తీసుకున్నామని.. మధ్యవర్తుల లెక్కలు మాకు తెలియవని వివరణ ఇచ్చారు. మాకు ఎంతైతే ఒప్పందం చేసుకున్నారో అంత చెల్లించారని తెలిపారు.

ఇక అమెరికాలో నిధులు మిస్ యూజ్ చేశారని.. మీడియాలో నా పేరు రావడంతోనే ప్రధాన కార్యదర్శి నరేష్ కు ఫోన్ చేసి 45 నిమిషాలు మాట్లాడానని శ్రీకాంత్ తెలిపారు. లెక్కలన్నీ చూసేది అధ్యక్షుడు – ప్రధాన కార్యదర్శి – ట్రెజరర్ అని.. ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అయినా తాను కాదని.. తనను మీడియాలో టార్గెట్ చేయడంపై నరేష్ ప్రెస్ మీట్ కు రమ్మని ఆహ్వానించానని తెలిపారు. కానీ ఆయన నిన్ననే మాట్లాడాం కాదా అని షూటింగ్ లో బిజీగా ఉన్నానని రాలేనని అన్నారని తెలిపారు.

మా లో నిధుల దుర్వినియోగం ఆరోపణలు రావడం.. తన పేరు ప్రముఖంగా ప్రస్తావించడంపై హీరో శ్రీకాంత్ చాలెంజ్ విసిరారు. ఆరోపణలు నిరూపిస్తే తాను మా గడప తొక్కనని.. సభ్యత్వం క్యాన్సల్ చేసుకొని వెళ్లిపోతానని.. ఒకవేళ తనపై ఆరోపణలు రుజువు చేయని పక్షంలో ఆరోపణలు చేసిన వారు కూడా ఇదే చేస్తారా అని శ్రీకాంత్ సవాల్ విసిరారు.

ఇక చివర్లో ‘మా’ కు ఓ అత్యాధునిక భవంతి నిర్మాణం కోసం ఇదంతా చేస్తున్నామని ట్రెజరర్ పరుచూరి వెంకటేశ్వరరావు వివరణ ఇచ్చారు. సంవత్సరన్నర కింద 2.10 కోట్లు ఉన్న మా ఆదాయం.. ఇప్పుడు రూ.5.60కోట్లకు చేరిందని.. మహేష్ – ప్రభాస్ – నాగార్జునలతో ఫంక్షన్స్ చేసి రూ.10 కోట్లు వరకూ సంపాదించి మాకు భవనం కట్టి సిల్వర్ జూబ్లీ సెలెబ్రేషన్స్ చేయాలనుకుంటున్నామని పరుచూరి తెలిపారు.

అయితే శ్రీకాంత్ పై మీడియాలో నిధుల దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు రావడం.. శ్రీకాంత్ సహా మా అధ్యక్షులు సభ్యులు ఖండించడం జరిగిపోయింది. కానీ ప్రధాన కార్యదర్శి నరేష్ ఈ మీడియా సమావేశానికి ఎందుకు రాలేదనేది అంతుచిక్కని ప్రశ్నగా ఉంది. షూటింగ్ ఉండి రాలేదా.? లేక నిధుల దుర్వినియోగం జరిగిందని తెలిసి వీరికి దూరంగా ఉన్నారా అన్న అనుమానాలు మీడియాలో వస్తున్నాయి. మా అధ్యక్షుడు శివాజీ రాజా సహా అందరూ నరేష్ పై సీరియస్ అవ్వడం చూశాక ‘మా’లో ఏదో జరిగిందన్న అనుమానాలు కలుగకమానడం లేదు.. నరేష్ బయటకు వచ్చి చెబితే కానీ ఆ గుట్టు బయటపడేటట్టు లేదు. చూడాలి మరి మాలో అవినీతి ఆరోపణలు గుట్టు నిజమా కాదా అన్నది..