కళ్యాణంపై 28కోట్ల పందేరం

0గత కొంతకాలంగా నితిన్ `శ్రీనివాస కళ్యాణం`కి దక్కిన టన్నుల కొద్దీ బూస్ట్ ని బట్టి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తీరాలి. ఆ విషయంలో నిర్మాత దిల్ రాజు – నితిన్ ఎంతో కాన్ఫిడెన్స్ ని మీడియా ముందు ప్రదర్శించారు. కళ్యాణం కమనీయం.. పెళ్లిపై సినిమా అంటేనే ఉద్విగ్నత. దానిని మేం తెరపై అందంగా ఆవిష్కరించాం. తెలుగువారి సంస్కృతి – సాంప్రదాయాల్ని తెర నిండుగా పరిచేశామని ఎంతో అందంగా చెప్పారు. నితిన్ – రాశీ అయితే నిజంగానే పెళ్లాడేయాలనిపించిందని స్టేట్మెంట్లు ఇస్తూ సిగ్గులమొగ్గలయ్యారు. అయితే ఆ అందమంతా సినిమాలో కనిపిస్తే కచ్ఛితంగా శ్రీనివాస కళ్యాణం హిట్టే. నేడు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్ లోకి రిలీజైంది. మధ్యాహ్నానికి మీడియా రివ్యూలు అందుబాటులోకి వచ్చేస్తాయి.

ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఇకమీదట నితిన్ గురించి ఓ మాట చెప్పాలి. `అ.. ఆ` లాంటి బ్లాక్ బస్టర్ తో తెలుగు రాష్ట్రాలు సహా ఓవర్సీస్ లోనూ మిలియన్ డాలర్ క్లబ్ హీరోగా తనని తాను ఎలివేట్ చేసుకున్నాడు నితిన్. అమెరికా నుంచి 10కోట్ల వసూళ్లు తేగలిగే సత్తా ఉన్న హీరోగా నిరూపించుకున్నాడు. ఆ జోరులోనే `శ్రీనివాస కళ్యాణం` ఓవర్సీస్ సహా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 28కోట్లకు క్రయవిక్రయాలు సాగాయి. అంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 28 కోట్ల షేర్ రాబట్టాలి. దీనర్థం ఆల్ మోస్ట్ డబుల్ గ్రాస్ వసూలు చేయాలన్న మాట.

నిన్నటి సాయంత్రం నుంచి ఓవర్సీస్ లో ప్రివ్యూల సందడి ఓ రేంజులో సాగింది. అక్కడి నుంచి డాలర్ల వేట రిపోర్ట్ అందింది. సినిమా ఆద్యంతం సోసోగానే ఉన్నా.. క్లైమాక్స్ అద్భుతంగా పండిందన్న మాట వినిపించింది. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ డైలాగులు సూపర్భ్ అన్న టాక్ వచ్చింది. అయితే జయాపజయాల్ని ఆ ఒక్క క్లైమాక్స్ నిర్ణయిస్తుందా? ఒకవేళ అది బూస్ట్ ఇవ్వగలిగితే ఈ సినిమాకి పెద్ద ప్లస్ కానుందని విశ్లేషిస్తున్నారు. నితిన్ కి మరోవైపు `విశ్వరూపం2` నుంచి తీవ్రమైన పోటీ నెలకొంది. విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన సినిమా కావడంతో దీనిపైనా భారీ అంచనాలున్నాయి. ఈలోగానే మరో క్రేజీ సినిమా `గీత గోవిందం` నాలుగు రోజుల గ్యాప్ తోనే ఆగస్టు 15 నుంచి పోటీకి దిగుతోంది. దేవరకొండకు నైజాం సహా ఆంధ్రాలోనూ అసాధారణ ఫాలోయింగ్ ఉంది. శ్రీనివాస కళ్యాణం టీజర్ కంటే ఆలస్యంగా వచ్చిన `గీత గోవిందం` టీజర్ అంతుకుమించిన జెట్ స్పీడ్ తో లక్షల్లో వ్యూస్ ని దక్కించుకుంది. కాబట్టి నితిన్ కి ఇది ఠఫ్ కాంపిటీషన్ అనే చెప్పాలి. నేడు రివ్యూలు.. సోమవారానికి వాస్తవిక ఓపెనింగుల వివరం తెలుస్తోంది. సోమవారం తర్వాత అసలు రిపోర్ట్ ని ట్రేడ్ వెల్లడిస్తుంది. అంతవరకూ వెయిట్ & సీ..