ఛీ..శాంత్‌

0ఐపీఎల్‌లో ‘స్పాట్‌ ఫిక్సింగ్‌’ కుంభకోణం, దొరికిపోయిన రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు సభ్యులు, క్రికెటర్లు శ్రీశాంత్‌, చండిలా, చవాన్‌ల అరెస్టు, 5 రోజుల పోలీసు కస్టడీ, 14 మంది బుకీలు అరెస్టు

న్యూఢిల్లీ: క్రికెట్‌లో ఐపీఎల్‌ ఓ సంచలనమైతే.. అదే ఇప్పుడు ఫిక్సింగ్‌ కుంభకోణంలో కూరుకుని మరో సంచలనానికి వేదికైంది. ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు బౌలర్లు ఎస్‌.శ్రీశాంత్‌, అజిత్‌ చండిలా, అంకిత్‌ చవాన్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు ముంబయిలో ఉన్న క్రికెటర్లను బుధవారం అర్ధరాత్రి దాటాక అరెస్టు చేశారు. ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో రూ.60 లక్షలు తీసుకుని.. ఒక ఓవర్‌లో ముందుగానే నిర్ణయించిన మేరకు పరుగులు ఇవ్వాలనే ఒప్పందం చేసుకున్నారనే ఆరోపణలపై వారిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీశాంత్‌, చండిలా, చవాన్‌లు కనీసం మూడు ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో ముందుగానే బుకీలతో చేసుకున్న ఒప్పందం చేసుకుని స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. సదరు బుకీలకు విదేశాల్లో ఉన్న మాఫియాతో సంబంధాలున్నట్లు చెబుతున్నారు. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 420 (మోసం), 120-బి (నేరపూరిత కుట్ర) అభియోగాల కింద అరెస్టు చేసిన క్రికెటర్లను ఢిల్లీకి తరలించారు. వీరిపై కఠినమైన మహారాష్ట్ర సంఘటిత నేరాల నియంత్రణ చట్టం -ఎంకోకా కింద కేసు మోపే అవకాశం ఉంది. దీనివల్ల బెయిల్‌కు వీలులేకుండా జైలుకు పంపే అవకాశం ఉంది. వీరిని ఢిల్లీ కోర్టులో హాజరు పరచగా ఐదు రోజుల కస్టడీ విధించింది. తాజా పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ ముగ్గురు ఆటగాళ్లనూ సస్పెండ్‌ చేసింది.

సూత్రధారి విదేశాల్లో: ఢిల్లీ కమిషనర్‌
ఢిల్లీ పోలీసు కమిషనర్‌ నీరజ్‌ కుమార్‌ గురువారం కిక్కిరిసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఇదే కేసుతో సంబంధం ఉన్న 14 మంది బుకీలను కూడా అరెస్టు చేసినట్లు చెప్పారు. మరో ఇద్దరు బుకీల కోసం వెదుకుతున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఇతర క్రికెటర్ల ప్రమేయాన్ని కొట్టిపారేశారు. ఫిక్సింగ్‌కు లోనైన ఐపీఎల్‌ మ్యాచ్‌లకు సంబంధించిన దృశ్య-శ్రవణ ఆధారాలను వెల్లడించారు. రాజస్థాన్‌ రాయల్స్‌ మే 5, 9, 15వ తేదీల్లో పుణె వారియర్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, ముంబయి ఇండియన్స్‌ జట్లతో ఆడిన మ్యాచ్‌లు ఫిక్సింగ్‌కు గురైనట్లు పేర్కొన్నారు. మ్యాచ్‌ మధ్యలో ఒప్పందంలో భాగంగా వేసే ఓవర్‌ సంబంధించి బుకీలు, ఒప్పందం కుదుర్చుకున్న క్రికెటర్ల మధ్య చోటుచేసుకునే సంకేతాల వివరాలనూ నీరజ్‌కుమార్‌ వెల్లడించారు. ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ వ్యవహారంలో ముంబయి మాఫియా పాత్ర ఉందని ఢిల్లీ పోలీసు కమిషనర్‌ పేర్కొన్నారు. ఈ కుంభకోణంలో సూత్రధారి విదేశాల్లో కూర్చున్నారనీ, ముంబయి మాఫియా ప్రమేయం ఉందన్నారు. అసలు సూత్రధారి దుబాయిలో ఉన్నారా అనడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ప్రదేశం ఎక్కడనేది చెప్పలేననీ, ఈ కుంభకోణానికి విదేశాలతో సంబంధాలు ఉన్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. దావూద్‌ ఇబ్రహీంగానీ మరెవరైనా మాఫియా డాన్‌ల ప్రమేయం ఉందా అని అడగగా, విశ్వసనీయమైన రుజువు దొరికేంత వరకూ ఎవరి పేర్లనూ వెల్లడించలేమన్నారు. ఏప్రిల్‌ నుంచీ వారిపై నిఘా పెట్టామనీ, తప్పులు చేయనిచ్చామన్నారు. తమ నిఘాలో ఒకే జట్టులోని ఆటగాళ్లు దొరికిపోయారనీ, అయితే ఇతర జట్టలో, ఇతర మ్యాచ్‌ల్లో ఇలాందేమీ జరగలేదని నిర్దిష్టంగా చెప్పలేమన్నారు. ఆస్ట్రేలియా క్రీడాకారుడు షాన్‌టెయిట్‌గానీ, ఇతర క్రీడాకారుల ప్రమేయం ఉందా అని ప్రశ్నించినప్పుడు అలాంటి ఆధారాలేమీ లేవని చెప్పారు. ఐపీఎల్‌ జట్ల యాజమాన్యాలకుగానీ, ఇతర క్రీడాకారులకుగానీ దీంట్లో సంబంధం ఉన్నట్లు తమకు ఆధారాలేమీ లభించలేదని పోలీసులు పేర్కొన్నారు. శ్రీశాంత్‌, చండీలా, అంకిత్‌లపైనే నిఘా పెట్టటం అన్నది కేవలం యాదృచ్ఛికమేనని, ఇతర జట్లు, ఇతర మ్యాచుల్లో ఫిక్సింగ్‌ జరగటం లేదని గట్టిగా చెప్పలేమని పోలీస్‌ అధికారులు స్పష్టం చేశారు. తమ కుమారుడిని ఈ కేసులో ఇరికించటానికి భారత క్రికెట్‌ జట్టు సారథి ధోనీ కుట్ర పన్నారంటూ శ్రీశాంత్‌ తల్లిదండ్రులు చేసిన ఆరోపణలను ప్రస్తావించినప్పుడు నీరజ్‌కుమార్‌ పెద్దగా నవ్వుతూ.. ”ఇది పూర్తిగా తప్పు. ధోనీ తన ప్యాంటు జేబులో జేబురుమాలు పెట్టుకోలేదు” అని వ్యాఖ్యానించారు. ఆటగాళ్ల నుంచి సొమ్మును స్వాధీనం చేసుకోవటానికి ఈడీ, ఐటీ వంటి సంస్థలను సంప్రదిస్తామన్నారు. ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్న సాంకేతిక నిపుణుడు, స్పెషల్‌ సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ బద్రీశ్‌దత్‌ అనుమానాస్పదంగా మృతి చెందటంపై ఆయన స్పందిస్తూ.. ఫిక్సింగ్‌ కేసు పరిణామాలకు దత్‌కు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. ఇటీవల ఢిల్లీలో వరస అత్యాచార సంఘటనలతో అన్ని వర్గాల నుంచీ విమర్శలనూ, రాజీనామా డిమాండ్లను ఎదుర్కొంటున్న పోలీసు కమిషనర్‌ నీరజ్‌కుమార్‌ తాజా కేసును వివరిస్తున్న సందర్భంగా పాత్రికేయులను ఉద్దేశించి.. ఇప్పటికీ తనను రాజీనామా కోరతారా అని ప్రశ్నించారు. పాత్రికేయ సమావేశం ముగిసిన తర్వాత టీవీ పాత్రికేయుల వద్దకు వెళ్లి.. ‘ఈరోజు నా రాజీనామా అడగడం లేదా?’ అని నవ్వుతూ ప్రశ్నించారు.

ముగ్గురికీ 5 రోజుల కస్టడీ
అరెస్టయిన క్రికెటర్లు శ్రీశాంత్‌, చండిలా, చవాన్‌లతోపాటు మరికొంతమందిని స్పాట్‌ ఫిక్సింగ్‌ వ్యవహారంపై ప్రశ్నించేందుకు వీలుగా న్యాయస్థానం గురువారం 5 రోజుల పోలీసు కస్టడీకి పంపింది. ఇందులో మరికొంతమంది ప్రమేయమూ ఉందనీ, ఇంకొన్ని అరెస్టులూ జరగొచ్చని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు. బుకీలు ఇతర క్రీడాకారులనూ సంప్రదించినట్లు దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. గురువారం అరెస్టయిన శ్రీశాంత్‌, చండిలా, చవాన్‌లతోపాటు బుకీలను ఢిల్లీలోని సాకేత్‌ జిల్లా కోర్టుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వారి ముఖాలకు ముసుగులు కప్పారు. సాకేత్‌ న్యాయస్థానాల సముదాయంలోని చీఫ్‌మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ లోకేష్‌కుమార్‌ నివాసం వద్ద ఒకరి తర్వాత ఒకరిని హాజరుపరిచారు. మేజిస్ట్రేట్‌ నివాసంలోకి మీడియాను ప్రవేశించనీయలేదు. విచారణ సందర్భంగా.. మొత్తం వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చేందుకు క్రికెటర్లను, బుకీలను ప్రశ్నించేందుకు ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలని ఢిల్లీ పోలీసుల తరఫున హాజరైన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రాజీవ్‌మోహన్‌ కోరారు. కుట్రను బయటపెట్టేందుకు కస్టోడియల్‌ ఇంటరాగేషన్‌ అవసరముందన్నారు. ఐపీఎల్‌లో ఇతర మ్యాచ్‌లూ ఫిక్సయ్యాయనీ, నిందితులను ప్రశ్నించాల్సి ఉందనీ, భారీ ఎత్తున డబ్బుల పాత్ర ఉందన్నారు. చవాన్‌, చండిలా తరఫున హాజరైన న్యాయవారి రాజీవ్‌శంకర్‌ త్రివేదీ తమ క్త్లెంట్లు అమాయకులన్నారు. ఇద్దరు బుకీల మధ్య సంభాషణల్లో చోటు చేసుకున్న పేర్ల ఆధారంగా క్రికెటర్లపై కేసుపెట్టారన్నారు.

క్రికెటర్ల సస్పెన్షన్‌
తాజా పరిణామాలతో బీసీసీఐ దిగ్భ్రాంతికి గురైంది. అరెస్టయిన ముగ్గురు క్రికెటర్లను సస్పెండ్‌ చేసింది. ఈ వ్యవహారాన్ని తదుపరి చర్యల నిమిత్తం క్రమశిక్షణ సంఘానికి అప్పజెప్పింది. విచారణ అనంతరం తప్పు చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. శ్రీశాంత్‌, చండిలా, చవాన్‌లను ప్రస్తుతానికి సస్పెండ్‌ చేశామనీ, అవసరమైన సమాచారాన్నంతా సేకరిస్తున్నామనీ, తప్పు తేలితే కఠిన చర్య తీసుకుంటామని బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. బీసీసీఐ అవినీతిని ఎంతమాత్ర సహించదనీ, ఈ విషయంలో దర్యాప్తునకు ఢిల్లీపోలీసులు, ఇతరులతో పూర్తిస్థాయిలో సహకరిస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది. ఐపీఎల్‌ పాలకమండలి సమావేశమై, ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రికెటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఐపీఎల్‌ ఫ్రాంచైజీలతో మంచి ఒప్పందాలున్నా, ఇలాంటి అవినీతి కార్యకలాపాల్లో పాలుపంచుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. ఐసీసీ అవినీతి నిరోధక విభాగం సేవలను పొందడం ద్వారా క్రికెటర్లు, ఇతర సిబ్బందిని అవినీతికి పాల్పడకుండా చూస్తుందని వెల్లడించింది. తాజాగా సస్పెండైన ముగ్గురిపైనా జీవితకాలం నిషేధం అవకాశముందని బీసీసీఐ ఉన్నతస్థాయి వర్గాల సమాచారం. మరోవైపు.. ఫిక్సింగ్‌ ఆరోపణల్లో దొరికిపోయిన క్రికెటర్లు అజిత్‌ చండిలా, అంకిత్‌ చవాన్‌లను వారికి యాజమాన్య సంస్థ ఎయిర్‌ ఇండియా ఉద్యోగాల నుంచి తొలగించింది.

ఢిల్లీ పోలీసులు ఛేదించారిలా..?
క్రికెట్‌ ప్రపంచాన్ని వూపేసిన తాజా స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణాన్ని ఢిల్లీ పోలీసులు ఛేదించిన వైనం ఆసక్తికరంగా ఉంది. ఓ వ్యవస్థీకృత నేరానికి సంబంధించి దర్యాప్తు జరుపుతున్న ఢిల్లీ పోలీసుల ప్రత్యేక బృందానికి చెందిన ఓ అధికారి.. క్రికెట్‌ మైదానంలో సంకేతాలకు సంబంధించి జరుగుతున్న సంభాషణను యథాలాపంగా విన్నారు. అసహజంగా అనిపించిన సదరు సంభాషణలు ఆ అధికారిలో ఆసక్తిరేపాయి. తన పై అధికారులకు సమాచారాన్ని అందించారు. సంకేతాలు ఇచ్చేది ఎవరు, ఎందుకు ఇస్తున్నారు అనే విషయాల్ని తేల్చాలని రంగంలోకి దిగారు. ఓ ఫోన్‌కాల్‌పై నిఘా పెట్టిన అనంతరం దర్యాప్తును దేశవ్యాప్తంగా విస్తృతం చేశారు. కొంతమంది బుకీలు గుజరాత్‌, ముంబయిల్లో ఉన్నట్లు అనుమానించారు. సీబీఐలో తన పదవీకాలాన్ని పూర్తిచేసుకుని ఇటీవలే ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం సంయుక్త కమిషనర్‌గా చేరిన మదన్‌మోహన్‌ ఒబెరాయి యాదృచ్ఛికంగా విన్న సదరు ఫోన్‌కాల్‌తో సంబంధం ఉన్న అన్ని ఫోన్‌కాల్స్‌పైనా నిఘాపెట్టారు. కొద్ది రోజులు గడవగానే ఇదో సంచలన కేసుగా మారే అవకాశం ఉందని గ్రహించారు. ఢిల్లీ కమిషనర్‌ నీరజ్‌కుమార్‌ సైతం ప్రత్యేక ఆసక్తితో ఈ కేసును రోజూ వ్యక్తిగత స్థాయిలో పర్యవేక్షించడం మొదలుపెట్టారు. ఇతర రాష్ట్రాల పోలీసులతోనూ సమన్వయం జరపడం ద్వారా ముందుకు నడిపారు. వందల గంటలకుపైగా సంభాషణలను రికార్డు చేసిన అనంతరం ఢిల్లీ పోలీసులు చివరికి బుకీలను, ముగ్గురు రాజస్థాన్‌ ఆటగాళ్లను అరెస్టు చేయాలని నిర్ణయించారు.

ఐపీఎల్‌లో ఫిక్సింగ్‌కు సంబంధించి బుకీల ప్రణాళికలకు సంబంధించిన సమాచారాన్ని మార్చి నెల మధ్యభాగంలో పోలీసులకు ఉప్పందింది. దీనితో నిఘా తీవ్రతను పెంచి దుబాయికి సంబంధించిన ఓ నంబర్‌ నుంచి వచ్చే కాల్స్‌ను రహస్యంగా విన్నారు. బుకీల మధ్య సాగిన సంభాషణలు ముగ్గురు రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాళ్లకు పట్టించేందుకు దారితీసింది.
శ్రీశాంత్‌ను ముంబయిలోని కార్టర్‌ రోడ్‌ నుంచి అరెస్టుచేయగా, చండిలాను ఇండర్‌కాంటినెంటల్‌ హోటల్‌ నుంచి, చవాన్‌ను హోటల్‌ ట్రిడెంట్‌ నుంచి అరెస్టు చేశారు. ఇద్దరు బుకీలు అమిత్‌ కుమార్‌, మానన్‌లు ఇంటర్‌ కాంటినెంటర్‌ హోటల్‌లోని 336 గది నుంచి అరెస్టు చేశారు. అంటే బుకీలు, క్రికెటర్లు ఒకే హోటల్‌లో బస చేసినట్లు అర్థమవుతోందని పోలీసు ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ముంబయి అంధేరి ఈస్ట్‌కు చెందిన చంద్రేష్‌ పటేల్‌, అహ్మదాబాద్‌కు చెందిన అమిత్‌కుమార్‌, మానన్‌, కన్నూరుకు చెందిన జిజూ జనార్దన్‌లను ముంబయిలో అరెస్టుచేశారు. పాటియాలాకు చెందిన దీపక్‌ కుమార్‌, రోహిణీకి చెందిన రాకేష్‌లను ఢిల్లీలో అరెస్టు చేశారు. అరెస్టయిన బుకీల్లో మరికొందరి పేర్లను దర్యాప్తులో భాగంగా బయటికి వెల్లడించలేదని పోలీసులు తెలిపారు. బుకీల్లో నలుగురు బుకీ ఎక్స్ఛేంజీలో పనిచేస్తున్నట్లు తెలిపారు. ముంబయి, ఢిల్లీ, గుర్గావ్‌లలో ప్రాథమిక సోదాలు జరిపారు. సోదాల్లో 51 మొబైల్‌ ఫోన్లు, ఐదు ల్యాప్‌టాప్‌లు, ఒక రికార్డింగ్‌ పరికరాన్ని జప్తుచేశారు. మరికొంతమంది బుకీల అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.

* స్పాట్‌ ఫిక్సింగ్‌ వ్యవహారంలో బీసీసీఐకి, ఢిల్లీ పోలీసులకు సంపూర్ణ మద్దతు ఇవ్వనున్నట్లు ఐసీసీ ప్రకటించింది.