కేరళకు స్టార్ల విరాళాలు..అభిమానుల ఆగడాలు..

0ఇహలోక స్వర్గంగా పేరుగాంచిన కేరళ.. వరదల ధాటికి అతలాకుతలమైంది. పచ్చని అడవులు – కొలువు దీరిన కొండలు శిథిలమయ్యాయి. కాలువలన్నీ పోటెత్తిన వరదతో నామరూపలేక్కుండా పోయాయి. ఇళ్ల చుట్టూ నీరు చేరి తినడానికి తిండిలేక జనం హాహాకారాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చాలామంది విరాళాలను పెద్ద ఎత్తున పంపిస్తున్నారు. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందజేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. చాలామంది సెలెబ్రెటీలు కూడా ఈ సాయం చేస్తున్నారు. కానీ వారి అభిమానులు మాత్రం అత్యుత్సాహం చేస్తూ హీరోలపై అభిమానంతో చేసింది గోరంత సాయమైతే.. కొండంత చేసినట్టు ప్రచారం చేస్తూ అందరికీ షాక్ ఇస్తున్నారు.

తమిళ అగ్రహీరో ఇళయదళపతి విజయ్ నాలుగు రోజుల క్రితం కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు ఏకంగా 14కోట్లు విరాళం ప్రకటించారని సోషల్ మీడియాలో వార్త గుప్పుమంది. ఇటీవల తమిళ హీరోలంతా నాలుగు లక్షల నుంచి 50 లక్షల వరకూ విరాళాలు ప్రకటించారు. కానీ విజయ్ మాత్రం ఏకంగా 14కోట్లు ప్రకటించాడని తెలియగానే అంతా నోరెళ్లబెట్టారు. నిజానికి 14 కోట్లు విజయ్ కు ఏమాత్రం లెక్కకాదు.. ఆయన అపర కుబేరుడే..కానీ ఇంత భారీ మొత్తం సాయం చేశాడా అని ఆరా తీయగా.. అది ఫేక్ న్యూస్ అని తేలింది. ఈ విషయంలో విజయ్ కానీ ఆయన పీఆర్వో కానీ ధ్రువీకరించలేదు. తమిళ అగ్ర మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఈ వార్తను తప్పు అని ప్రకటించాయి.

ఇక అప్పట్లో కేరళకు వచ్చిన సన్నీలియోన్ ను అక్కడి యువత గుండెల్లో పెట్టుకున్నారు. సన్నీ కోసం ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. ఈ నేపథ్యంలోనే కేరళను ఆదుకునేందుకు సన్నీలియోన్ కూడా రూ.5 కోట్లు విరాళం ఇచ్చిందని సోషల్ మీడియాలో వార్త గుప్పుమంది. దీనిపై సన్నీ క్యాంప్ నుంచి .. ఆమె పీఆర్వో – మేనేజర్ల నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు.

ఇలా కేరళ వరదల పుణ్యమానికి విరాళాలు పోటెత్తుతున్నాయి. అదే సమయంలో ఫేక్ విరాళాలు హోరెత్తుతున్నాయి. చాలా మంది తమ అభిమాన తారల అంతిచ్చారు.. ఇంతిచ్చారంటూ ఊదరగొట్టుకుంటున్నారు. ఇది ఆయా తారలను ఇబ్బందుల్లోకి నెడుతోంది. ఆయా ప్రముఖులంతా అధికారికంగా ప్రకటిస్తే కానీ నమ్మడానికి వీల్లేకుండా పరిస్థితి తయారైంది.