ఏపీలో నిరుద్యోగ భృతిపై కీలక ప్రకటన

0నిరుద్యోగ భృతి అమలుపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. నెలకు రూ.వెయ్యి చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాలని నిర్ణయించింది. ఈ రోజు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన దాదాపు 3గంటల నుంచి మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి నారా లోకేశ్‌ మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో సుమారు 10లక్షల మంది యువతకు నిరుద్యోగ భృతి చెల్లించాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. ఇందుకోసం ఏటా రూ.1200 కోట్లు ఖర్చవుతుందన్నారు. ఈ భృతి చెల్లింపునకు కనీస అర్హతను డిగ్రీ లేదా డిప్లొమాగా పరిగణించాలని అనుకున్నామన్నారు. దీనిపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామని, 12 దేశాల్లో అధ్యయనం చేశామని అన్నారు. మన దేశంలో కూడా 10 రాష్ట్రాల్లో ఈ నిరుద్యోగ భృతి చెల్లించే కార్యక్రమం చేపట్టి విఫలమయ్యారని తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో రెండేళ్లలోనే నిలిపేస్తే.. కొందరు ఆర్నెళ్లలోనే ఆపేశారన్నారు. అయితే, శాచ్యురేషన్‌ మోడల్‌లో ఈ పథకాన్ని అమలుచేసే తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని లోకేశ్‌ చెప్పారు. ఈ రోజు మంత్రివర్గంలో దీనిపై కొన్ని విధివిధానాలు రూపొందించినట్టు తెలిపారు. వీటిపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నాకవారి స్పందనను బట్టి మార్పులు చేర్పులు చేసి మరోసారి కేబినెట్‌లో చర్చించి అమలుచేసే తేదీని ప్రకటిస్తామని చెప్పారు.

విధివిధానాల్లో ముఖ్యమైనవి కొన్ని..
* దరఖాస్తు చేసుకొనేవారు బీపీఎల్‌ కుటుంబానికి చెందినవారై ఉండాలి, తెల్ల రేషన్‌ కార్డు కల్గి ఉండాలి.
* 22 నుంచి 35 ఏళ్ల వయస్సు కల్గినవారే అర్హులు.
* డిగ్రీ లేదా డిప్లొమా చదివి ఉండాలి
* ఒక కుటుంబంలో ఇంతమంది అని పరిమితిలేదు.* నేరుగా బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తం జమచేస్తారు ( బయోమెట్రిక్‌ పద్ధతి ద్వారా)
* నిరుద్యోగ భృతి చెల్లించడంతో పాటు సామాజిక కార్యక్రమాల్లోనూ వారిని భాగస్వాముల్ని చేస్తారు. స్వచ్ఛాంధ్ర, వనం – మనం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లోనూ భాగస్వాముల్ని చేస్తారు.