మహర్షి టైటిల్ డీ కోడింగ్ – పెద్ద కథే ఉంది

0మొన్న ప్రిన్స్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ కు కానుకగా ఇచ్చిన మహర్షి టైటిల్ ఫస్ట్ లుక్ ప్లస్ టీజర్ ఆన్ లైన్లో చేసిన రచ్చ చూసాంగా. ఇప్పటికీ దాన్ని చూసుకుని మహేష్ ఫాన్స్ తెగ మురిసిపోతున్నారు. వయసు నలభై దాటిందా లేక అబద్దం చెబుతున్నారా అనేలా ఉన్న లుక్ ని వాకింగ్ స్టైల్ ని చూసి సగటు ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారంటే అతిశయోక్తి కాదు. టైటిల్ అయితే సాఫ్ట్ గా క్యాచీగా ఉందని అందరు ఏకాభిప్రాయం వ్యక్తపరుస్తున్నప్పటికీ టైటిల్ లోగో లో దర్శకుడు వంశీ పైడిపల్లి కథకు సంబంధించిన కొన్ని సూక్ష్మ విషయాలు పొందు పరచడం ఆశ్చర్యం కలిగిస్తుంది. లోగో అంటే ఏదో డిజైనర్ కు ఇచ్చేసి నచ్చేలా చేయమని చెప్పడం కాదు కథకు సంబందించిన ఆత్మ అందులో ఉండేలా చేయటం అని వంశీ నిరూపించాడు. అదేంటో చూద్దాం.

మహర్షి టైటిల్ మొత్తం మూడు అక్షరాలు. మొదటి అక్షరం ‘మ’ తీసుకుంటే అందులో తలకట్టుని తుపాకీ మడమ అంచులాగా తీర్చిదిద్దారు. ఇక రెండో అక్షరం ‘హ’ ను తీసుకుంటే అందులో తలకట్టు కత్తి కొనను ప్రతిబింబించేలా డేషింగ్ చేసారు. ఇక మూడో అక్షరం ‘ర్షి’ తీసుకుంటే ష వత్తుకు పై అంచులో సుప్రసిద్ధ స్టాచ్యూ అఫ్ లిబర్టీ జూమ్ చేసి చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే టైటిల్ లోగో వెనకాల ట్రాన్స్ పరెంట్ గా ఉన్న బ్యాక్ గ్రౌండ్ లో పైన పల్లెటూరి నేపధ్యాన్ని సెట్ చేస్తే కింది భాగంలో నగరాన్ని సూచిస్తున్నట్టుగా ఆర్ట్ వర్క్ ఉంది. వీటి మధ్యలో ఏదో మాథ్స్ క్యాలికులేషన్ చేసినట్టుగా వైట్ పేపర్ లేదా బోర్డు తరహాలో సమస్యను పరిష్కరించినట్టు కనిపిస్తుంది. సో మొత్తం ఇందులో 6 అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అంటే ముందు నుంచి వినిపిస్తున్న ప్రకారం కథకు పల్లెటూరి నేపధ్యానికి ఏదో బలమైన కనెక్షన్ ఉందని క్లారిటీ వచ్చేసింది. తుపాకీ మడమ-కత్తి కొన-స్టాచ్యూ అఫ్ లిబర్టీ-పల్లెటూరు-నగరం-లెక్కల చిక్కు ఇలా మొత్తం డీ కోడ్ చేస్తే వంశీ పైడిపల్లి అచ్చం సుకుమార్ తరహాలో అలోచించి చాలా లాజికల్ గా మహర్షి అనే టైటిల్ దగ్గరుండి డిజైన్ చేయించుకున్నట్టు అర్థమవుతోంది. సో కాలేజీ లైఫ్ తో మొదలుపెట్టి రైతు సమస్యను చర్చిస్తూనే హింసకు ప్రతిరూపంగా భావించే తుపాకీని కత్తిని చూపించారు కాబట్టి యాక్షన్ మసాలా కూడా ఫుల్ గా ఉన్నట్టు క్లారిటీ వచ్చేసినట్టే. అమెరికాలో జరిగే భాగం ఉంది లిబర్టీ ప్రతిమ ఉంది. అసలు మహర్షి అమెరికా నుంచి సిటీకి అక్కడి నుంచి పల్లెటూరికి ఎందుకు వచ్చాడు ఆ ఆయుధాలు ఎందుకు పట్టాల్సి వచ్చింది ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఇంకో ఆరు నెలల దాకా ఓపిక పట్టాల్సిందే. ఆ లోపు ఏదైనా టీజర్ లాంటిది వస్తే కొంత సమాధానం దొరకొచ్చు. చూద్దాం.