రేప్‌ చేస్తామని ట్వీట్లు.. పీఎస్‌లో నటి ఫిర్యాదు

0Suchitra-Krishnamoorthi‘అజాన్’ గురించి ట్వీట్‌ చేసిన బాలీవుడ్‌ నటి-గాయని సుచిత్రా కృష్ణమూర్తి పట్ల సోషల్‌ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఆమె పట్ల కొందరు ‘లైంగికంగా కించపరిచేలా’ వ్యాఖ్యలు చేశారు. ఆమెను రేప్‌ చేస్తామని బెదిరించారు. తీవ్రస్థాయిలో వెల్లువెత్తిన ‘లైంగిక వేధింపుల ట్వీట్ల’పై ఆమె పోలీసులను ఆశ్రయించారు. ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా నలుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

తెల్లవారుజామునే చెవులు పగిలిపోయేలా ‘అజాన్‌’ పిలుపు ఇవ్వడాన్ని ఆమె ట్విట్టర్‌లో తప్పుబట్టారు. తన దేవుడిని గుర్తుచేసేందుకు ఇలా పబ్లిక్‌ లౌడ్‌స్పీకర్లు వాడాల్సిన అవసరం లేదని, ఇది బలవంతంగా మతాన్ని ప్రజలపై రుద్దడమేనని అన్నారు. ఆమె వ్యాఖ్యలను కొంతమంది ప్రశంసించగా.. మరికొంతమంది తప్పుబట్టారు. గతంలో బాలీవుడ్‌ సింగర్‌ సోనూ నిగమ్‌ కూడా ఇదేవిధంగా ట్వీట్‌ చేసి సోషల్‌ మీడియాలో ఆగ్రహాన్ని చవిచూశాడు. తాజాగా తనకు వచ్చిన లైంగిక బెదిరింపుల స్ర్కీన్‌షాట్లను కొన్నింటినీ ట్వీట్‌ చేసిన సుచిత్ర.. ‘ఈ వికృత వ్యక్తులను చూడండి. నా దేశాన్ని చూస్తే జాలేస్తుంది. మహిళల పట్ల ఇలాంటి దృక్పథం ఉన్నప్పుడు ప్రపంచంలో మన దేశమే రేప్‌ రాజధానిగా ఉండటంలో ఆశ్చర్యమేముంది’ అని పేర్కొన్నారు.