హాట్ టాపిక్.. సుకుమార్ వాడకం!

0Darshakudu-Movie-Promotionsఓవైపు రామ్ చరణ్.. మరోవైపు సురేందర్ రెడ్డి.. ఇంకో పక్క వంశీ పైడిపల్లి.. ఇంకా చందూ మొండేటి.. సుధీర్ వర్మ.. సతీశ్ వేగేశ్న.. అనిల్ రావిపూడి.. ఇంతమంది కలిసి ఒక ఆడియో వేడుకలో సందడి చేయడం అరుదైన విషయం. ఐతే అదేమీ ఒక పెద్ద హీరో.. పెద్ద దర్శకుడు కలిసి చేస్తున్న భారీ సినిమా ఏమీ కాదు. ఒక కొత్త హీరో.. కొత్త దర్శకుడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిన్న సినిమా. అయినప్పటికీ ఇంతమంది ప్రముఖులు ఆ ఆడియో వేడుకలో సందడి చేశారంటే దాని వెనుక ఉన్న ఏకైక పేరు.. సుకుమార్.

చేసింది తక్కువ సినిమాలే కానీ.. వాటితో సుకుమార్ తెచ్చుకున్న రెస్పెక్ట్ అలాంటిలాంటిది కాదు. ప్రేక్షకులే కాదు.. టాలీవుడ్ సెలబ్రెటీలకూ అతనంటే ఇష్టం.. గౌరవం. అందుకే సుక్కుకు సంబంధించిన వేడుక ఏదైనా సరే.. అతిథులుగా రావడానికి అభ్యంతరం చెప్పరు సెలబ్రెటీలు. వీళ్లను తన ప్రొడక్షన్లో వచ్చే సినిమాల ప్రమోషన్ల కోసం వాడుకోవడంలో సుకుమార్ కూడా ఏమీ మొహమాట పడట్లేదు. ‘కుమారి 21 ఎఫ్’ సినిమాను ఎన్టీఆర్ సాయంతో ఎంత బాగా ప్రమోట్ చేశాడో గుర్తుండే ఉంటుంది.

ఇక తన అన్నయ్య కొడుకు అశోక్ ను హీరోగా.. తన మిత్రుడు హరి ప్రసాద్ జక్కాను దర్శకుడిగా పరిచయం చేస్తూ చేసిన ‘దర్శకుడు’ విషయంలో ఈ ‘వాడకం’ మరింత పెంచాడు సుక్కు. ఇప్పటికే ఎన్టీఆర్.. సమంత.. రకుల్ ప్రీత్ లాంటి వాళ్లను ప్రమోషన్ కోసం ఉపయోగించుకున్న ఆడియో వేడుకకు రామ్ చరణ్ తో పాటు పలువురు దర్శకుల్ని రప్పించాడు. వాళ్లందరూ చక్కటి ప్రసంగాలతో ఈ ఆడియో వేడుకను ప్రత్యేకంగా మార్చారు.

సుకుమార్ కూడా తన కోసం వచ్చిన అందరి గురించి చక్కగా మాట్లాడాడు. అదే సమయంలో ‘దర్శకుడు’ థియేట్రికల్ ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో ఈ సినిమా గురించి ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి ఇండస్ట్రీలో. మొత్తంగా సుక్కు టాలీవుడ్లో తన పరిచయస్తులందరినీ తెలివిగా వాడుకుని తన సినిమాల్ని ప్రమోట్ చేస్తూ వాటిని వార్తల్లో నిలబెడుతున్న తీరు మిగతా దర్శక నిర్మాతలకూ ఆదర్శమే.