మళ్ళీ రివెంజా సుక్కు?

0రంగస్థలంతో ఇండస్ట్రీ హిట్ కొట్టేసిన సుకుమార్ మహేష్ బాబుతో తన కొత్త సినిమా కోసం రంగంలోకి దిగిపోయాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ దసరాకు ప్రారంభించి జనవరి నుంచి రెగ్యులర్ గా కొనసాగేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఆ లోపు పూర్తి బౌండెడ్ స్క్రిప్ట్ తో సుకుమార్ రెడీగా ఉండటంతో పాటు ప్రీ ప్రొడక్షన్ కు సంబంధించిన పనులు కూడా పూర్తి చేసుకోవచ్చు కనక ప్లానింగ్ లో ఎక్కడా తేడా రాకుండా ఉంటుందని సెట్ చేసుకున్నారట. ఇన్ సైడ్ టాక్ ప్రకారం సుకుమార్ ఇందులో ఎలాంటి రిస్క్ కానీ ప్రయోగాలు కానీ చేయటం లేదు. 1 నేనొక్కడినేలో చేసిన పొరపాట్లు రిపీట్ కాకుండా ఫాన్స్ తో పాటు ప్రేక్షకులు మెచ్చేలా ఒక థ్రిల్లింగ్ రివెంజ్ స్టోరీ రాసుకున్నాడట సుక్కు.

రంగస్థలం కూడా రివెంజ్ బ్యాక్ డ్రాపే. అన్న కుమార్ బాబును చంపిన హంతకుడి కోసం తమ్ముడు చిట్టిబాబు చేసే పోరాటమే రంగస్థలంగా మారి చరిత్ర సృష్టించింది. కాకపోతే హీరోకు వినపడదు అనే పాయింట్ కొత్తగా అనిపించడంతో పాటు 80ల నాటి నేపధ్యం ప్రేక్షకులను కట్టి పడేసింది. కానీ మహేష్ సినిమాలో హీరోకు అలాంటి లోపం ఏది పెట్టలేదు అని తెలిసింది. అందరు అదే ఫాలో అవుతున్నారు కనక దాని జోలికి సుకుమార్ వెళ్లడం లేదని వినికిడి .

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న 25వ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్న మహేష్ సుకుమార్ మూవీకి జనవరి నుంచి రెడీ అయిపోతాడు. ఆ లోపు వంశీ సినిమా దాదాపు ఒక కొలిక్కి వచ్చి ఉంటుంది కనక ఇబ్బందులు ఉండవు. ఇప్పుడున్న ప్లాన్ ప్రకారం అయితే వచ్చే సంవత్సరం మహేష్ సినిమాలు రెండు వస్తాయి.

భరత్ అనే నేను సక్సెస్ ఇచ్చిన కిక్ తో ఇకపై కథల ఎంపికలో జాగ్రత్తగా ఉంటానన్న మహేష్ దానికి తగ్గట్టే తొందరపడకుండా నెమ్మదిగా వెళ్తున్నాడు. ఇకపై అర్థం కానీ సినిమాలు తీయనని రంగస్థలం సక్సెస్ మీట్ లో చెప్పిన సుక్కు మహేష్ ని ఎలా చూపిస్తాడా అనే ఆసక్తి పెరుగుతోంది. 1 నేనొక్కడినే ప్లాప్ అయినా సుక్కు టేకింగ్ మహేష్ యాక్టింగ్ కి ఫిదా అయినవాళ్లు చాలా ఉన్నారు. అలాంటిది అందరికి మెచ్చేలా మహేష్ ని చూపిస్తాను అంటున్న సుకుమార్ అంచనాలు ఏ రేంజ్ కి తీసుకెళ్తాడో చూడాలి మరి.