హిందీ ఆరెక్స్ 100 రంగం సిద్ధం

0

టాలీవుడ్ లో ఈ ఏడాది స్మాషింగ్ అండ్ సర్ ప్రైజింగ్ హిట్ గా నిలిచిన ఆరెక్స్ 100 ఇతర బాషలలో రీమేక్ కోసం వేగంగా అడుగులు వేస్తోంది. విడుదలకు ముందు పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఆరెక్స్ 100 ఆ తర్వాత సృష్టించిన ప్రభంజనం చిన్నది కాదు. అందుకే హక్కుల కోసం భారీ పోటీ నెలకొంది. ఇప్పటికే తమిళ్ వెర్షన్ లో ఆది పినిశెట్టి హీరోగా ఇందూ పాత్రలో తాప్సీ పన్నుతో షూటింగ్ మొదలుపెట్టేసారు. మరోవైపు హిందీలో కూడా దీన్ని పునర్నిర్మించడానికి రంగం సిద్ధమవుతోంది. ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా దీని హక్కులను కొన్న సంగతి తెలిసిందే. హీరోగా ఎవరు చేస్తారా అనే సస్పెన్స్ కు తెరవీడింది.

సల్మాన్ ఖాన్ తర్వాత కండల విషయంలో ధీటుగా పోటీ పడే నిన్నటి తరం హీరో సునీల్ శెట్టి వారసుడు అహన్ శెట్టిని దీని ద్వారా తెరకు పరిచయం చేయబోతున్నారు. 90వ దశకంలో సూపర్ హిట్ సినిమాల ద్వారా మనకు కూడా బాగా పరిచయమున్న సునీల్ శెట్టి తెలుగు సినిమాలను రీమేక్ చేసుకోవడంలో చాలా ఆసక్తి చూపేవాడు. అన్న శివయ్య లాంటివి హిందీలో రీమేక్ చేసుకుంది సునీల్ శెట్టినే.

ఈ ఆరెక్స్ 100 హిందీ రీమేక్ లో హీరోయిన్ ఖరారు కావాల్సి ఉంది. సబ్బిర్ ఖాన్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఇతగాడితో చిన్న చిక్కు ఉంది. సౌత్ రీమేక్ లను తన చిత్తానికి విచిత్రమైన మార్పులు చేస్తుంటాడు. కాకపోతే అవి కమర్షియల్ సక్సెస్ అవుతుండటంతో నడిచిపోతోంది. గతంలో టైగర్ ష్రాఫ్ ను హీరోపంటి ద్వారా పరిచయం చేసింది ఇతనే. అది పరుగు రీమేక్. ఆ తర్వాత అదే హీరోతో భాగీ తీసాడు. ఇది వర్షం రీమేక్. గోపీచంద్ పాత్రను సుధీర్ బాబు చేసాడు అందులో.

ఈ మధ్యే మున్నా మైకేల్ అనే స్ట్రెయిట్ సినిమా తీసాడు కానీ ఆడలేదు. అందుకే మళ్ళి రీమేక్ రూట్లోకి వస్తున్నాడు. మరి సహజంగా ఉండే ఆరెక్స్ 100 నేపధ్యాన్ని మార్చుకుంటాడు అనడం లో డౌట్ అక్కర్లేదు. త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టి వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు నడియాడ్ వాలా. ఇలా ఒకేసారి మూడు భాషల్లో రీమేక్ అవుతున్న తెలుగు సినిమాగా ఈ మధ్య కాలంలో అర్జున్ రెడ్డి తర్వాత ఆరెక్స్ 100 నిలవడం విశేషం.
Please Read Disclaimer