సునీల్ విలనిజం కథ వింటారా!

0తెరపై ఎంట్రీ ఇవ్వగానే పంచుల మీద పంచులు వేస్తూ కడుపుబ్బా నవ్విస్తుంటాడు సునీల్. అందుకే అతను తెలుగులో ఓ స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత హీరో అయ్యాడు. హీరో అయినా నవ్వించడమే పనిగా పెట్టుకున్నారాయన. అలాంటి నటుడిని ఒకసారి విలన్గా ఊహించుకోండి. సునీల్ విలనీ ఏంటి? కామెడీ కాకపోతే అనిపిస్తుంది కదూ! నిజమే… ఇదే మాట సునీల్ కూడా అంటున్నాడు. ఇప్పుడు నేను కామెడీ చేస్తే జనాలు నవ్వుకుంటారని తనదైన స్టైల్ లో చెబుతున్నాడు. కానీ సునీల్ మాత్రం మొదట్లో విలనే కావాలనుకున్నాడట. ఆయన ఇటీవల నరేష్ తో కలిసి నటించిన `సిల్లీ ఫెలోస్` సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియా ముందుకొచ్చాడు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ “నాకు కోట శ్రీనివాసరావు యాక్టర్ గా ఇన్ స్పిరేషన్. ఆ తర్వాత మోహన్ బాబు. వీళ్లిద్దరినీ చూసి నేను కూడా విలన్ గా నటించాలని ఇండస్ట్రీకి వచ్చాను. కానీ నేను ఊహించని రీతిలో కమెడియన్ ని అయిపోయాను. ఇప్పుడు కూడా విలనీ చేయాలనే ఉంది. కానీ నేను ఇప్పుడలా కనిపిస్తే జనాలు సీరియస్ గా నవ్వుకుంటార“ని చెప్పుకొచ్చాడు సునీల్. ప్రతి సినిమాలో నవ్విస్తుంటారు మీరు – మరి మిమ్మల్ని నవ్వించేవాళ్లు ఎవరని అడిగితే… “నిజంగా నన్ను నవ్వించే వాళ్లంటే నాకు చాలా ఇష్టం. ప్రజెంట్ జెనరేషన్ నటుల్లో సత్య – వెన్నెల కిషోర్ – శ్రీనివాసరెడ్డి – ప్రవీణ్… వీళ్లంతా కూడా బాగా నవ్విస్తున్నారు. వాళ్ల నటనని తెరపై చూసి ఎంజాయ్ చేస్తుంటా“ అని చెప్పుకొచ్చాడు సునీల్.