సూపర్‌స్టార్‌ ప్రియురాలెవరో తెలిసింది

0HUMA-QURESHIసూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సరసన ఆడిపాడే అవకాశం కోసం బాలీవుడ్‌ కథానాయికలు సైతం ఉవ్విళ్లూరుతుంటారు. ఇప్పటివరకూ బాలీవుడ్‌ నుంచి ఐశ్వర్యరాయ్‌, దీపికా పదుకొణె, సోనాక్షి సిన్హా, రాధికా ఆప్టే లాంటి భామలకు ఆ అవకాశం దక్కింది. ఇప్పుడు మరో బాలీవుడ్‌ ముద్దుగుమ్మ హ్యుమా ఖురేషి ఈ జాబితాలో చేరింది. రజనీ తదుపరి చిత్రంలో అతని ప్రియురాలిగా నటించబోతోంది హ్యుమా. ఈ చిత్రాన్ని రజనీ అల్లుడు ధనుష్‌ నిర్మిస్తుండటం, ‘కబాలి’ దర్శకుడు పా రంజిత్‌ తెరకెక్కింస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. రజనీ చిత్రానికి ధనుష్‌ నిర్మాతగా వ్యవహరించడం ఇదే తొలిసారి. ‘కబాలి’ అనుకున్నంతగా ప్రేక్షకులకు చేరువకానప్పటికీ, రజనీ మళ్లీ రంజిత్‌పై నమ్మకముంచి వెంటనే మరో అవకాశం ఇవ్వడం విశేషం. ‘కబాలి’లాగే ఈ చిత్రంలోనూ రజనీ మాఫియా డాన్‌గా కనిపించబోతున్నారని, ఒకప్పటి ముంబయి డాన్‌ హాజీ మస్తాన్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారని సమాచారం. హాజీ మస్తాన్‌ను చెడుగా చిత్రీకరించే సినిమాను తీయొద్దంటూ అతని కుమారుడిగా చెప్పుకొంటున్న ఓ వ్యక్తి రజనీకి ఇటీవల నోటీసులు పంపడం గమనార్హం. అయితే దీనిపై రజనీ స్పందించలేదు. కాగా ‘రోబో’కు సీక్వెల్‌గా రజనీ నటిస్తున్న ‘2.0’ వచ్చే జనవరి 25న విడుదలకానుంది.