రోజాను హైకోర్టులోనే తేల్చుకోమన్న సుప్రీం

0


Roja-Fires-on-Chandrababu-Nవైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజాను ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేసిన అంశంపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ కేసు వ్యవహారం హైకోర్టులో ఇంకా పెండింగ్‌లోనే ఉన్నందున తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

హైకోర్టులోనే ఈ కేసు అంశాన్ని తేల్చుకోవాలని రోజా తరఫు న్యాయవాదులకు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. రోజా ఇప్పటికే క్షమాపణ చెప్పారని, లేఖ కూడా పంపారంటూ ఆమె తరఫున న్యాయవాదులు సుప్రీంకు తెలిపారు.

కాగా, రాష్ట్ర ప్రభుత్వానికి ఆ లేఖ అందలేదని ప్రభుత్వం తరఫున న్యాయవాదులు న్యాయస్థానానికి చెప్పారు. దీంతో ఆ క్షమాపణ లేఖను ఇప్పుడు ఇవ్వగలుగుతారా? అని రోజా న్యాయవాదులను సుప్రీంకోర్టు అడగగా.. రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదికి న్యాయస్థానం సమక్షంలోనే లేఖ అందజేశారు.

ఈ లేఖను సంబధిత శాఖలు, అధికారులకు పంపాలని ఈ సందర్భంగా న్యాయస్థానం ఆదేశించింది. హైకోర్టులో కేసు ముగిసిన తర్వాత మాత్రమే తాము విచారణకు స్వీకరిస్తామని మరోసారి సుప్రీం స్పష్టం చేసింది. దీంతో హైకోర్టులోనే కేసు విచారణ జరగనుంది.

అసెంబ్లీలో అనుచితంగా ప్రవర్తించారంటూ శాసనసభ స్పీకర్ గతం(2016)లో రోజాపై ఏడాదిపాటు సస్పెన్షన్ విధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రోజా క్షమాపణలు చెబుతూ లేఖలు రాశారు. అంతకు ముందే ఆమె.. సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు.