కాలాకు సుప్రీం ఊరట.. నిషేధానికి నో!

0తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం కాలా. ఈ మూవీ ఈ వారం విడుదల కానుంది. కావేరీ జలాల ఇష్యూ నేపథ్యంలో కాలాను కర్ణాటకలో విడుదల చేయకూడదంటూ భారీ ఎత్తున ఆందోళనలు.. నిరసనలు సాగుతున్నాయి. కర్ణాటకలో కాలాను రిలీజ్ చేయకుండా అడ్డుకోవాలంటూ కొందరు కోర్టును ఆశ్రయించారు.

దీనిపై విచారించిన సుప్రీంకోర్టు.. తాజాగా తన తీర్పును వెలువరించింది. కాలాకు ఊరటనిస్తూ ఆదేశాల్ని జారీ చేసింది. కావేరీ నేపథ్యంలో కాలాను నిషేధించటం సరికాదని స్పష్టం చేసింది. కాలాకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటీషన్లను రిజెక్ట్ చేసిన సుప్రీం నిర్ణయంతో కర్ణాటకలో ఈ సినిమా విడుదలకు అడ్డంకులు తొలిగినట్లైంది.

కాలా సినిమా విడుదలను అడ్డుకోవాలన్న పిటిషన్లు కొన్ని కర్ణాటక హైకోర్టుకు చేరాయి. అయితే.. వీటిపై మంగళవారం తీర్పును ఇచ్చిన కోర్టు.. కాలాను అడ్డుకోవటం సరికాదని పేర్కొంది. అయితే.. థియేటర్ల వద్ద భద్రత విషయం రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాల్సి ఉందని స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా.. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి హైకోర్టు తీర్పుపై స్పందిస్తూ.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాలా విడుదలను వాయిదా వేయటమే సరైన నిర్ణయమని.. భావోద్వేగాలు చల్లారిన తర్వాత విడుదల చేయటం మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన రజనీ.. ఈ రోజు ఉదయం సీఎం కుమారస్వామికి కన్నడలో ఒక మేసేజ్ పంపుతూ.. కాలా విడుదలకు సహకరించాల్సిందిగా కోరారు. థియేటర్లకు పోలీసు భద్రత కల్పించాలన్న విన్నపాన్ని తన మేసేజ్ లో చేశారు.

ఇదిలా ఉండగా.. ఇదే అంశంపై తాజాగా సుప్రీంకోర్టు కూడా పాజిటివ్ గా రియాక్ట్ కావటం.. సినిమా విడుదలకు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సినిమా విడుదలను అడ్డుకోవాలన్న పిటిషన్లను తిరస్కరించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాలా యూనిట్ కు సుప్రీం నిర్ణయం ఊరటనిస్తోందని చెప్పక తప్పదు.