చారిటీకి ఇల్లు రాసిచ్చేసిన సూర్య ఫ్యామిలీ

0Suriya-Family-donates--house-to-Agaram-Foundationతమిళ స్టార్ హీరోకు నటుడిగానే కాక వ్యక్తిగానూ చాలా మంచి పేరుంది తమిళనాట. ‘అగరం ఫౌండేషన్’ పేరుతో ఓ స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేసి.. చాలా ఏళ్లుగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు సూర్య.. అతడి కుటుంబ సభ్యులు. తల్లిదండ్రులు లేక అనాథలుగా మారిన.. పేద కుటుంబాలకు చెందిన వేలాది మంది చిన్నారులకు ఈ సంస్థ చదువు చెప్పిస్తోంది. వారి బాగోగులు చూస్తోంది. చాలామంది లాగా పబ్లిసిటీ కోసం నామమాత్రంగా ఫౌండేషన్ పెట్టి హడావుడి చేయడం కాకుండా.. చాలా సిన్సియర్ గా ‘అగరం’ను నడుపుతుందని సూర్య కుటుంబానికి పేరుంది. దీనికి విరాళాలు కూడా అందుతుంటాయి. స్వయంగా సూర్య కుటుంబమే కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంటుంది ఈ ఫౌండేషన్ కోసం.

ఐతే తాజాగా సూర్య కుటుంబం ఈ ఫౌండేషన్ కోసం చేసిన త్యాగం చర్చనీయాంశం అవుతోంది. దశాబ్దాలుగా తాము ఉంటున్న ఇంటిని ‘అగరం’ ఫౌండేషన్ కు ఇచ్చేసింది సూర్య ఫ్యామిలీ. సూర్య తండ్రి శివకుమార్ ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇల్లు ఇది. ఇక్కడే ఆయన దశాబ్దాలుగా ఉంటున్నారు. సూర్య.. కార్తి పుట్టి పెరిగి పెద్దయింది ఇక్కడే. వాళ్ల పెళ్లిళ్లూ ఇక్కడే అయ్యాయి. సూర్యకు పిల్లలు పుట్టింది కూడా ఇక్కడే. ఈ ఇంటిని చాలా సెంటిమెంటుగా భావిస్తాడు శివకుమార్. ఐతే కుటుంబం పెద్దది కావడంతో అందరూ కలిసి ఉండటానికి ఇబ్బంది అవుతోందని.. మరో ఏరియాలో సూర్య ఫ్యామిలీ పెద్ద ఇల్లు కట్టుకుంది. తమ పాత ఇంటిని అమ్మేయకుండా అగరం ఫౌండేషన్ కు ఇచ్చేసింది. కోట్లాది రూపాయల విలువైన ఇంటిని సూర్య ఫ్యామిలీ ఇలా స్వచ్ఛంద సేవకు కేటాయించడం ప్రశంసలందుకుంటోంది.